పోటీలో చిదంబరం, దిగ్విజయ సింగ్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజీనామా చేసినట్లు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖర్గే శనివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ఒక వ్యక్తికి ఒకే పదవి సిద్ధాంతం మేరకు 80 ఏళ్ల ఖర్గే తన శనివారం రాత్రి రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించినట్లు వర్గాలు పేర్కొన్నారు. ఖర్గే రాజీనామాతో ఖాళీ కానున్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి చిదంబరం, దిగ్విజయ సింగ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశి థరూర్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కర్నాటకకు చెందిన దళిత నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే విజయం ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో నెలకొంది.