కాంగ్రెస్ సారథ్యంపై ఆయనకు నచ్చచెబుతాం
మల్లికార్జున్ ఖర్గే స్పష్టీకరణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తిరిగి చేపట్టవలసిందిగా ఆయనకు నచ్చచెబుతామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించే ఏ నాయకుడికైనా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండాలని, కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ దాకా ఆ వ్యక్తికి ప్రజల మద్దతు ఉండాలని శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాజ్యసభలో ప్రతిఇపక్ష నాయకుడైన ఖర్గే అన్నారు. యావత్ కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు ఉండడంతోపాటు అందరికీ ఆమోదయోగ్యుడై ఉండాలని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ తప్ప పార్టీలో ఎవరికీ ఆ అర్హతలు లేవని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా సోనియా గాంధీపై పార్టీ సీనియర్ నాయకులు అందరూ అప్పట్లో ఒత్తిడి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీని కూడా పార్టీ కోసం పోరాడాలని అందరూ కోరారని ఆయన చెప్పారు. రాహుల్ తప్ప వేరే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ విముఖంగా ఉన్నట్లు వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా పార్టీ కోసం, దేశం కోసం, దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిపై పోరు కోసం కాంగ్రెస్ అధ్యక్షబాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని అర్థిస్తామని ఖర్గే తెలిపారు. పార్టీ త్వరలో చేపట్టనున్న భారత్ జోడో యాత్రను ప్రస్తావిస్తూ జోడో భారత్ కోసం రాహుల్ గాంధీ అవసరమని ఆయన చెప్పారు.