Tuesday, July 2, 2024

పదేళ్ల ‘అప్రకటిత ఎమర్జన్సీ’సంగతి ఏమిటి?: మోడీపై ఖర్గే విమర్శలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన తీవ్ర విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తిప్పికొట్టారు, ప్రధాని నైతిక పరాజయం పిమ్మట కూడా మొండితనం వదలలేదని ఖర్గే విమర్శించారు, ప్రధానికి 50 ఏళ్ల నాటి ఎమర్జన్సీ గుర్తు ఉన్నది గానీ గడచిన పది సంవత్సరాల ఎమర్జన్సీ కాదని ఖర్గే ఆక్షేపించారు, ‘ప్రధాని మోడీ సోమవారం మామూలు కన్నా సుదీర్ఘంగా ప్రసంగించారు. నైతిక, రాజకీయ పరాజయం తరువాత కూడా మొండితనం అలాగే ఉన్నదని స్పష్టం అవుతోంది. పేపర్ లీక్, బెంగాల్‌లో రైలు ప్రమాదం వంటి ముఖ్యమైన అంశాలపై మోడీజీ ఏమైనా మాట్లాడతారేమోనని దేశం ఆశిస్తోంది. కానీ అలా జరగలేదు’ అని ఖర్గే అన్నారు.

‘నీట్, ఇతర పోటీ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజికి సంబంధించి యువత పట్ల ఆయన కొంత సానుభూతి చూపుతారని జనం ఆశించారు. కానీ భారీ రిగ్గింగ్‌కు, తన ప్రభుత్వ అవినీతికి ఆయన ఏమాత్రం బాధ్యత తీసుకోలేదు, పశ్చిమ బెంగాల్‌లో ఇటీవలి రైలు ప్రమాదం, రైల్వేల దారుణ నిర్వహణ లోపం గురించి మోడీజీ మౌనం దాల్చారు, మణిపూర్ గత 13 నెలలుగా హింసాకాండ గుప్పిట్లో ఉంది. కానీ మోడీజీ ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని కూడా అనుకోలేదు, అక్కడ తిరిగి సాగుతున్న దౌర్జన్య సంఘటనలపై ఆయన తాజా ప్రసంగంలో ఆందోళన కూడా వ్యక్తం చేయలేదు’ అని ఖర్గే దుయ్యబట్టారు.

అస్సాం, ఈశాన్య ప్రాంతంలోని వరదలు, ధరల విపరీత పెరుగుదల, రూపాయి చరిత్రాత్మక పతనం లేదా ఎగ్జిట్ పోల్ స్టాక్ మార్కెట్ కుంభకోణం విషయంలో కూడా ప్రధాని మౌనముద్ర దాల్చారని ఆయన ఆరోపించారు, ‘మోడీ ప్రభుత్వం తదుపరి జన గణనను దీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టింది, కుల గణనపై కూడా మోడీ పూర్తిగా మౌనం దాల్చారు, మోడీజీ! మీరు ప్రతిపక్షానికి సలహా ఇస్తున్నారు. మీరు మాకు 50 ఏళ్ల నాటి ఎమర్జన్సీని గుర్తు చేస్తున్నారు, కానీ గడచిన పది సంవత్సరాల అప్రకటిత ఎమర్జన్సీని విస్మరించారు. ప్రజలు దానిని అంతం చేశారు. ప్రజలు ప్రధానికి వ్యతిరేకంగా తమ తీర్పు ఇచ్చారు’ అని ఖర్గే తెలిపారు. ఏమైనా నరేంద్ర మోడీ ప్రధాని అయినందున ఆయన పని చేయాలని ఖర్గే సూచించారు.

‘ప్రజలకు కావలసింది అర్థవంతమైన పాలన, నినాదాలు కాదు, దీనిని మీరు గుర్తు ఉంచుకోవాలి’ అని మోడీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలు, ఇండియా కూటమి పార్లమెంట్‌లో ఏకాభిప్రాయాన్ని కోరుతున్నాయని, సభలోను, వీధుల్లోను, ప్రతి ఒక్కరి ముందు ప్రజల వాణిని అవి వినిపిస్తూనే ఉంటాయని ఆయన చెప్పారు, ‘మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. భారతీయ ప్రజాస్వామ్యం జిందాబాద్’ అని ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News