రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత టులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 15న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానం లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఖర్గే పేరును ప్రతిపాదిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. తొలుత ఈ పదవికి ఖర్గేతో పాటుగా దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ,చిదంబరం, కపిల్ సిబల్ లాంటి పలువురు సీనియర్ల పేర్లు వినిపించాయి. సీనియారిటీ ప్రకారం ఆజాద్ తర్వాతి స్థానంలో ఉన్న ఆనంద్ శర్మ రాజ్యసభలో ఉప ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు గులాం నబీ ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు తీసుకు రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి కేరళలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఈ స్థానంనుంచి ఆజాద్‌ను రాజ్యసభకు పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.