న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం తన ‘రైతు వ్యతిరేక’ విధానాల ద్వారా రైతులకు ‘మరింతగా అన్యాయం’ చేయరాదని, తన పాత వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం విజ్ఞప్తి చేశారు. కిసాన్ దివస్‌గా పాటిస్తున్న మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ఖర్గే నివాళులు అర్పించారు. ‘రైతులే భారత్, వారు దేశానికి గర్వకారకులు. కిసాన్ దివస్ సందర్భంగా కర్షక సోదర సోదరీమణులు, వ్యవసాయ కూలీలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ రైతుల కోసం పోరాడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అని ఖర్గే ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘మోడీ ప్రభుత్వం తన మొండితనంతో, రైతు వ్యతిరేక విధానాలతో మన రైతులకు మరింత అన్యాయం చేయదని, తన పాత వాగ్దానాలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం’ అని ఖర్గే తెలిపారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కిసాన్ దివస్ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.