న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా ఉన్న బీహార్ ము ఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం జరిగిన కూటమి వర్చువల్ సమావేశంలో తనకు పదవులపై ఆశ లేదని, కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా ఈ పదవి అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది. సమావేశంలో నితీశ్ కుమార్‌ను కూటమి కన్వీనర్‌గా చేసే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇటీవ లే జెడి(యు) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన నితీశ్ ఈ పదవికోసం తనకు ఎలాంటి కోరిక లేదని అం టూ ఈ పదవి చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
వర్చువల్ సమావేశంలో నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, అయితే నితీశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను ఈ పదవికి ఎంపిక చేస్తే బాగుంటుందని నితీశ్ సూచించారని జెడి(యు) జాతీయ స్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝా పాట్నాలో చెప్పారు. నితీశ్ పేరుకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు కానీ తాను ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ మతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలే శ్ యాదవ్‌తో చర్చిస్తానని ఖర్గే చెప్పారు. కన్వీనర్ అనేది కూటమిలోని మరో పదవి అని, చైర్‌పర్సన్ తర్వాతి స్థానం అదేనని కూటమి వర్గాలు చెప్తున్నా యి. కాగా శనివారం జరిగిన వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ తప్ప కూటమిలోని అన్ని పక్షాలు హాజరయ్యాయి. జాతీయ స్థాయిలో కూటమిలో ఐక్యతను కాపాడాల్సిన అవసరాన్ని రాష్ట్రస్థాయిలో విభేదాలు కూటమిలో అలజడికి కారణం కానివ్వకూడదని సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు నొక్కి చెప్పారు.
కూటమి ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం ఒక కోణం మాత్రమే. కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నిటి మధ్య సీట్ల పంపిణీ అనే చిక్కు సమస్యను అది ఇంకా పరిష్కరించుకోవలసి ఉంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెం బ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ మిత్ర పక్షాలు దేనికీ సీట్లు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. సమాజ్‌వాది పార్టీకి ఆరు స్థానాలు ఇస్తామన్న హామీని మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు కమల్‌నాథ్ నిలబెట్టుకోలేదు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మూడు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన అఖిలేశ్ యాదవ్ కమల్‌నాథ్‌ను పిసిసి అధ్యక్ష పదవినుంచి తప్పించాలని బహిరంగంగానే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
మరో వైపు సీట్ల సర్దుబాటుపై ఆమ్‌ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ జరుపుతున్న చర్చలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఢిల్లీలో నాలుగు స్థానాలు, పంజాబ్‌లో ఎనిమిది సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతుంటే అందుకు ఆప్ ససేమిరా అంటోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ తనకే అత్యధిక సీట్లు కావాలని కోరుతుండడంతో పాటుగా గోవా, హర్యానా, గుజరాత్‌లలో కూడా పోటీ చేయాలనుకుంటోంది. కాగా శనివారం జరిగిన ఇండియా కూటమి వర్చువల్ సమావేశానికి శివసేన(యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే హాజరు కాలేదు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా సమావేశంలో పాల్గొనడం లేదనే విషయాన్ని ఇప్పటికే కూటమికి తెలియజేసినట్లు ఉద్ధవ్ చెప్పారు.