Saturday, December 21, 2024

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో రచ్చ(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశం కోసం బిజెపి ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యసభలో మంగళవారం పెద్ద దుమారమే రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అందుకు నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మల్లికార్జున ఖర్గే సోమవారం రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా జరిరిగిన ర్యాలీలో బిజెపి సర్కారుపై విరుకుపడ్డారు. ‘సింహంలా మాట్లాడుతూ చిట్టెలుకలాగ ప్రవర్తిస్తారు. సరిహద్దులో చైనా దురాక్రమణకు పాల్పడినా ఎలాంటి చర్యలూ తీసుకోదు. పార్లమెంటులో చర్చ జరపకుండా తప్పించుకుంటుంది”అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దేశం కోసం కాంగ్రెస్ నిలబడింది, స్వాతంత్య్రం సాధించింది. ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. బిజెపి మాత్రం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా తామే దేశభక్తులమని ఢంకా బజాయించుకుంటోంది. మేము(కాంగ్రెస్) ఏదైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు” అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

ఇదిలావుండగా పార్లమెంటు సమావేశం కాగానే ఖర్గే వ్యాఖ్యలను బిజెపి నేతలు ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూశ్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని ఉటంకించారు. ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే రాజ్యసభలో ఉండే అర్హత కోల్పోతారని అన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతలా దిగజారి మాట్లాడతారని తాననుకోలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.

క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి చేసిన డిమాండ్‌ను ఖర్గే తోసిపుచ్చారు. పార్లమెంటు బయట చెప్పిన వ్యాఖ్యలకు సభలో చర్చ జరపాల్సిన అవసరమే లేదని అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని కానీ బిజెపిలో ఎవరు ప్రాణత్యాగం చేశారో చెప్పాలని ఖర్గే ఈ సందర్భంగా నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News