కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ప్రకటన
న్యూఢిల్లీ: సమృద్ధిగా వర్షాలు పడిన కారణంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో బియ్యంతోపాటు ఆహారధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 150.50 మిలియన్ టన్నులు సాధించవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి, పప్పు దినుసులు, నూనె గింజలు తదితర ఆహార ధాన్యాల దిగుబడి 2020-21 పంట సంవత్సరం(జులై-జూన్)లో 149.56 మిలియన్ టన్నులు ఉందని తెలిపింది. వరి, చెరకు, పత్తి పంటల దిగుబడి ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వేరుసెనగ, సోయా బీన్ వంటి నూనె గింజలతో పప్పు ధాన్యాల దిగుబడి స్వల్పంగా ఖరీఫ్‌లో తగ్గవచ్చని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఆహారధాన్యాల దిగుబడి మొదటి విడత అంచనాను తమోర్ విడుదల చేస్తూ రైతులు, శాస్త్రవేత్తల అవిశ్రాంత శ్రమతోపాటు రైతులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల దిగబడి సాధిస్తున్నట్లు తెలిపారు.