Monday, January 20, 2025

కృష్ణా బేసిన్ లో ఖరీఫ్ కష్టమేనా!

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా పంటల సాగు
60లక్షల ఎకరాల ఆయకట్టు కట కటా
ఆందోళనలో రైతాంగం
మధ్యకారు పంటలే శరణ్యం

హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వ్యవసాయరంగం ఆశలను తలకిందులు చేశాయి. ప్రత్యేకించి కృష్ణాబేసిన్ పరిధిలో ఈసారి ఖరీఫ్ పంటల సాగు పరిస్థితి దయనీయంగా మారింది. రుతుపవనాల రాకలో జరిగిన జాప్యం పంటల సాగు అదనుపై పెనుప్రభావం చూపింది. వర్షాకాలం ప్రవేశించి ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పటివరకూ కృష్ణానదీ పరివాహకంగా గట్టి వర్షం ఒక్కటీ లేదు. ఎగువన తూర్పు కనుమల్లో కురిసిన వర్షాలకు కృష్ణమ్మల్లో కదలిక వచ్చినప్పటికీ మహారాష్ట్ర ,కర్ణాటక రాష్ట్రాలకే వరదనీరు పరిమితం అయింది. అక్కడి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంతలోనే ఎగువ ప్రాంతాలో కూడా వర్షాలు మందగించాయి. ఈ ప్రభావం దిగువన ఉన్న తెలుగురాష్ట్రాలపైన పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న కృష్ణానది బేసిన్‌లోని ప్రాజెక్టులు -ఊస్సూరు మంటున్నాయి.

ఇటు తెలంగాణలో జూరాల, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల , రాజీవ్‌భీమా ఎత్తిపోతల,మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల , రాజోలిబండ మళ్లింపు పధకం, తుమ్మిళ్ల ఎత్తిపోతల , అటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకపడ కాలువ, ఎస్‌ఆర్‌బిసి ,తెలుగుగంగ, గాలేరునగరి,హంద్రీనీవా , తదితర పధకాలు కృష్ణా నదీజలాలమీదే ఆధారపడి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం , నాగార్జున సాగర్‌తోపాటు తెలంగాణలో ఎలిమినేటి మాధరెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా తెలంగాణ ఆయకట్టు ఆధారపడి ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖద్వారంలో ఉన్న జూరాల ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు మాత్రమే ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో నిండిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు గరిష్ట నీటినిలువ సామర్ధం పట్టుమని 10టిఎంసీలకు మించకపోవటంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుమాత్రమే ఖరీఫ్‌లో కొంత మెరుగ్గా వుంది.

ఇక శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు రైతుల పరిస్థితి ఆందోళన కరంగామారుతోంది. తెలుగు రాష్ట్రల పరిధిలో ఈ ప్రాజెక్టుల కింద 60 లక్షల ఎకరాల ఆయకట్టులో ఖరీఫ్‌పంటల సాగు ప్రశ్నార్దకంగా మారింది. వర్షాకాలం సగానికిపైగా గడిచిపోయినా శ్రీశైలం ప్రాజెక్టు ఇంకా 50శాతం ఖాళీగానే ఉంది. నీటిమట్టం కూడా శుక్రవారం నాటికి 864అడుగులకు చేరింది. ఎండిడిఎల్‌కంటే కేవలం 10అడుగులు మాత్రమే అదనంగా నీటినిలువ ఉంది. మహాత్మగాందీ కల్వకుర్తి ప్రాజెక్టు మీదా ఆధారపడి ఆయకట్టు రైతులు సాగునీటికోసం ఎదురు చూస్తూన్నారు. మరోవైపు అటు ఏపిలో కూడా కర్నూలు కడప కాలువ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులు సాగునీటికోసం ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీసం 875అడుగులు మించితే తప్ప ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి పంటలు వేసుకునే పరిస్థితి లేదంటున్నారు.
ఉస్సూరు మంటున్న సాగర్ !
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు జలాశయంలో నీటినిలువలు చూసి ఊస్సూరు మంటున్నారు.ఇటు తెలంగాణలో నల్లగొండ, సూర్యాపేట ,యాదాద్రి భువనగిరి , ఖమ్మం జిల్లాలతోపాటు అటు ఏపిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 570అడుల స్థాయిలో ఉంటేనే సాగర్‌కింద తెలంగాణ పరిధిలోని ఎడమకాలువకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర పరిధిలోని కుడికాలువకు కృష్ణాజలాల విడుదల సాధ్యపడదు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 515అడుగుల వద్దనేఉంది. సాగర్‌లో డెడ్‌స్టోరేజి స్థాయి నీటిమట్టం 510అడుగులు కాగా, ఆ స్థాయికి మించి మరో 5అడుగులు మాత్రమే ఎక్కువగా ఉంది. ఎగువ నుంచి సాగర్ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు కూడా పెద్దగా లేదు. ఈ పరిస్థితుల్లో సాగర్ నీటిమట్టం ఇప్పట్లో 570అడుగుల స్థాయికి చేరుతుందన్న నమ్మకం కూడా కలగటం లేదంటున్నారు.
మధ్యకారు పంటలే శరణ్యం
కృష్ణాబేసిన్‌పరిధిలోని ప్రాజెక్టుల ద్వారా నీటివిడుదల ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేకపోవటంతో ఆయకట్టు కింద ఖరీఫ్ పంటల సాగుకు అదను దాటిపోతోంది. ఈ నెల చివరిదాక ఎదురు చూసినా కాలువల ద్వారా నీరందే అవకాశాలు మెరుగుపడితే పడవచ్చునేమోగాని సాధారణ పంటలసాగుకు అదను మీరిపోతుందంటున్నారు.తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఖరీఫ్‌పంటల సాగు విస్తీర్ణం ఇప్పటికే 77.07శాతం చేరుకుంది.అయితే ఇందులో అత్యధికశాతం ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలో రాష్ట్ర సగటు విస్తీర్ణం కంటే సాగు తక్కువగానేఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణం 62శాతం మించలేదు. అదే విధంగా వనపర్తి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 24.97శాతంలోనే పంటలు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది .ఆర్డీఎస్ ద్వారా నీటివిడుదల లేకపోవటంతో ఈ జిల్లాలో 55.95శాతంలోనే పంటలు సాగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో కూడా 53.48శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలో 54.89శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగులోకి వచ్చాయి. ఇక ఏపిలోని రాయల సీమ జిల్లాల్లో ఇప్పటివరకూ 20శాతం మించి పంటలు సాగులోకి రాలేదు. రెండు రాష్ట్రాల పరిధిలో బోరుబావులు , చెరువుల కింద కొంత ఆయకట్టులో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే కేవలం ప్రాజెక్టుల ద్వారా నీటివిడుదలపైన ఆధారపడి ఉన్న ఆయకట్టులో మాత్రం రైతులు నీటికోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఆయకట్టులో ఇక సాధారణ ఖరీఫ్‌పంటలకు బదులుగా ప్రభుత్వం మధ్యకారు పంటల సాగు ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఏదైనా ఆకస్మిక వరదలతో శ్రీశైలం ,నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా నీరు చేరితే తప్ప ఈనెలాఖరు వరకూ ఈ ప్రాజెక్టుల కింద నీటి విడుదలపై అధికారులు కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News