Saturday, November 23, 2024

కోటి 9లక్షల ఎకరాలకు చేరిన ఖరీఫ్ పంటల విస్తీర్ణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం చివరిదశకు చేరింది. ప్రధాన ఆహార ధాన్య పంటలు, పప్పుదినుసు పంటలు , నూనెగింజ పంటలు, వాణిజ్య పంటలు కలిపి ఇప్పటివరకూ 1,09,83,798 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఈ సీజన్‌లో మొత్తం 1.24కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయించాలన్నది లక్షం కాగా , ఇప్పటివరకూ సాగు విస్తీర్ణం 88.37శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సారి వర్షాలు ఆలస్యమైనప్పటికీ పంటల సాగు సాధారణ స్థాయికి చేరువ కావడంతో వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వం పెట్టకున్న లక్ష్యాలకు ఢోకా లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రధానంగా వరిసాగు ఇప్పటికే ఎంపిక చేసుకున్న లక్ష్యాల్లో 99శాతం విస్తీర్ణానికి చేరుకుంది . 49.86లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా వేయగా ,

ఇప్పటికే 49.21లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడా వరినాట్లు పడుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి మించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో కూడా ఈ సమయానికి 42.70లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈ సారి అంతకు మించే వరిసాగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 24449 ఎకరాల్లో జొన్న, 515260 ఎకరాల్లో మొక్కజొన్న, మరో వెయ్యి ఎకరాల్లో సజ్జ, రాగి పంటలు సాగులోకి వచ్చాయి.

5.29లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు
రాష్ట్రంలో ఈ సారి పప్పుధాన్య పంటల సాగు విస్తీర్ణం కొంత వెనుకబడింది. 9.43లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా, అందులో ఇప్పటివరకూ కంది 4,57,146 ఎకరాలు, పెసర 52438, మినుము 19298 ఎకరాల్లో సాగు చేశారు.మరో 153 ఎకరాల్లో ఉలవ , 327ఎకరాల్లో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో పప్పుధాన్యాల విస్తీర్ణం సాధారణ లక్ష్యాల్లో ఇప్పటివరకూ 56.11శాతం లక్ష్యాలు చేరుకుంది.

87.34శాతం నూనెగింజ పంటలు
రాష్ట్రంలో ఈ సారి నూనెగింజ పంటలు సాధారణ విస్తీర్ణపు అంచనాల్లో 87.34శాతం చేరుకున్నాయి. 5.19లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేయాలన్నది లక్షం కాగా, ఇప్పటివరకూ 4.53లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఇందులో వేరుశనగ 7059 ఎకరాలు, సోయాబీన్ 4.43లక్షల ఎకరాలు, ఆముదం 2763 ఎకరాలు, నువ్వులు 208 ఎకరాలు ఇతర పంటలు మరో 81ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి 45.03లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. పొగాకు 112, చెరకు 31925 ఎకరాలు ఇతర పంటలు 1520ఎకరాల్లో సాగులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News