బిజెపి సమర్థన.. మహిళా సంఘాల ఆక్షేపణ
చెన్నై: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయడంపై సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన తాజా ట్వీట్ తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఖుష్బు లాంటి వ్యక్తులు ఆత్మసరిశీలన చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని, మహిళల గౌరవం, హక్కుల కోసం పోరాడేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తుల సరైన వేదికలని అఖిల భారత ప్రజాస్వామిక మహిలా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుగంతి పిలుపునివ్వగా గుజరాత్ ప్రభుత్వం ఆ 11 మంది ఖైదీలను విడుదల చేయడం పూర్తి చట్ట ప్రకారం జరిగిందని, అందులో ఎటుంటి రాజకీయాలు లేవని బిజెపి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ సమర్థించారు. ఖుష్బు ట్వీట్‌పై ఆమె స్పందిస్తూ మహిళలకు అన్యాయం జరగకూడదనే ఖుష్బు తెలియచేశారని, ఆ విషయంలో ఎవరికీ మరో ఆలోచనకు తావు లేదని వానతి స్పష్టం చేశారు. కాగా సుగంతి మాత్రం మహిళల విషయంలో సానుకూల, నిర్మాణాత్మక కార్యాచరణే ముఖ్యమని పేర్కొన్నారు. మితవాద శక్తులు మహిళల హక్కులను బలపరుస్తాయే తప్ప ఆచరణలో ఏమీ చేయరని విమర్శించారు. లౌకిక-ప్రజాస్వామిక శక్తులతో చేతులు కలపడమే ఏకైక ప్రత్యామ్నాయమని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా..ఖుష్బు సుందర్, వానతి శ్రీనివాసన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలలో సారూప్యత ఏమైనా ఉందా అంటూ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.