2014కు ముందు 25ఏళ్లలో 649 కిడ్నీ మార్పిడి సర్జరీలు జరగ్గా, 2014 నుంచి ఈ ఇప్పటికి 742 సర్జరీలు, ఈ ఏడాది ఇంతవరకు 100 శస్త్రచికిత్సలు, ప్రజారోగ్యంపై అత్యంత శ్రద్ధ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం వైద్యులను అభినందిస్తూ మంత్రి హరీశ్‌రావు ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజారోగ్యంపై తెలంగాణ రాష్ట్రం అత్యంత శ్రద్ధ పెట్టిందని, ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మారుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వరంగంలో ఆసుపత్రలను, వాటికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలను, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో అవయమ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో 1989 నుంచి 2021 వరకు 1,398 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగితే, 2013లో జీవన్‌ధాన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 816 శస్త్ర చికిత్సలు జరిగాయి.
తెలంగాణ ఏర్పాటుకు ముందు 25 సంవత్సరాల్లో కేవలం 649 జరుగగా, 2014 తర్వాత ఎనిమిదేళ్లలో 742 ఆపరేషన్లు నిర్వహించారు. 2016 నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ప్రతీ ఏడాది వందకుపైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగడం విశేషం. 2016లో 111 ఆపరేషన్లు, 2017లో 114, 2018 లో 111, 2019లో 107 ఆపరేషన్లు చేయగా.. 2020లో కరోనా కారణంగా ఈ ఆపరేషన్లు తగ్గినా, ఈ ఏడాది ఇప్పటి వరకు 100 ఆపరేషన్లు జరిగాయి. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్లో 97 మందికి ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించింది. 90కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించ డం విశేషం. ఈ శస్త్ర చికిత్సలను విజవంతంగా నిర్వహించి 25 మంది మహిళలకు, 75 మంది పురుషులకు కిడ్నీ మార్పిడి జరిగింది. అయితే, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు దాదాపు రూ.10 లక్షల నుంచి 12లక్షల వరకు ఖర్చు అవుతోంది. 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌ధాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు.
ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అవయవమార్పిడి సర్జరీలు
తెలంగాణ ప్రభుత్వం అవయవదానం కార్యక్రమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను పేదలకు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయిస్తోంది. అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితంగా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన వైద్య సదుపాయాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన మాడ్యూలర్ థియేటర్స్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఐసీయూ, డయాలసిస్ మిషన్లను అందుబాటులో ఉంచింది.
వైద్యులకు మంత్రి హరీశ్‌రావు అభినందన
ఎంతో నేర్పుతో, ఓర్పుతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించిన నిమ్స్ డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి మరిన్ని శస్త్ర చికిత్సలు నిర్వహించి, కిడ్నీ రోగులకు ప్రాణదానం చేయాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. వైద్య సిబ్బంది మరింత ఉత్సాహంతో, పేదలకు ప్రేమతో సేవలందించాలని, వారి నుంచి ప్రశంసలు పొందాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.