సియోల్: దాదాపు ఐదు నెలల తర్వాత మొదటిసారి బుధవారం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఆ దేశ మీడియా ముందు కనిపించారు. కరోనావైరస్ మహమ్మారి కాలంలో పాలక కుటుంబం అయిన కిమ్ జోంగ్ కుటుంబం తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించింది. చాంద్రమాన నూతన సంవత్సరం సెలవు దినాన్ని పురస్కరించుకుని రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని మన్సుడే ఆర్ట్ థియేటర్‌లో జరిగిన కళా ప్రదర్శనకు కిమ్, రి హాజరైనట్లు అధికారిక కెసిఎన్‌ఎ వార్తా సంస్థ తెలిపింది. కిమ్ సతీమణి రి సోల్ జు ఇదివరలో సెప్టెంబర్ 9న బహిరంగంగా కనిపించారు. కుమ్‌సుసన్ రాజభవనంను తన భర్త కిమ్‌తో కలిసి రి సందర్శించారు. ఆ రాజభవనంలో లేపనం పూసిన కిమ్ తండ్రి, తాత మృతదేహాలున్నాయి. దేశ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారు ఈ రాజభవనాన్ని సందర్శించారు.
‘థియేటర్ ఆడిటోరియంలో కిమ్, ఆయన సతీమణి రి సోల్ జు కనిపించగానే వారికి ఆహ్వాన సంగీతం వినిపించారు. ప్రేక్షకులు ‘హుర్రా’ అంటూ నినదించారు’ అని కెసిఎన్‌ఎ వార్తా సంస్థ పేర్కొంది. రి సోల్ జు సంవత్సర కాలంగా మీడియా ముందు కనిపించపోయేసరికి ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆమె గర్భవతి అయిందన్న ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. కిమ్, రి సోల్ జుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గూఢచర్య సంస్థ భావిస్తోంది. కానీ వారి గురించి బహిరంగంగా ఏమీ తెలియదు.