Friday, December 20, 2024

ఆగిపోయిన దయార్ద్ర హృదయం

- Advertisement -
- Advertisement -

గద్దర్‌ను కోల్పోయిన దుఃఖ తడి ఆరక ముందే హైదరాబాద్ మరో దీనబాంధవుడిని కోల్పోయింది. గద్దర్ కు ఆప్తమిత్రుడైన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను మిత్రఖేదం మింగివేసింది. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ అయిన జహీరుద్దీన్ అలీ ఖాన్ 7 తేదీ ఉదయం లాల్ బహదూర్ స్టేడియం నుండి గద్దర్ పార్థివ దేహ యాత్రలో నడుస్తూ పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని పక్కవారికి చెప్పి కూలబడిపోయారు. వారు నీళ్లు తాగించి ఛాతీపై నొక్కుతూ ప్రథమ చికిత్స అందించి కొంపల్లిలోని ఒక హాస్పిటల్‌కు తీసికెళ్ళినా ఫలితం దక్కలేదు. మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారని డాక్టర్లు చెప్పారు. మిత్రుడి అంతిమ యాత్రలో పాల్గొన్న జహీర్ ఖాన్ ఊహించని రీతిలో గుండెపోటుతో మరణించి ఉన్న విషాదాన్ని ద్విగుణీకృతం చేశారు. ఆయన వయసు 63 ఏళ్ళు.

ఉర్దూ పత్రిక రంగంలో సొంత ముద్రగల జహీర్ ఖాన్ ప్రజాస్వామ్య ప్రేమికుడిగా గుర్తింపు పొందా రు. సియాసత్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల నేతల ఆర్భాటాలను, తప్పుడు పనులను విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. చాలా విషయాల్లో సియాసత్ కథనాలు నిష్పక్షపాతంగా ఉంటాయని ఉర్దూ రానివారు ఎందరో ఇంగ్లీష్ వెర్షన్‌ను చదువుతుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలంగా పాల్గొనేవారు. తన ప్రతి ఆలోచనలోనూ సామాజిక న్యాయం, సమానత్వం ప్రాథమిక సూత్రాలుగా ఎంచుకొనేవారు. బహుజన సంఘాలకు, ప్రజాస్వామ్య సంఘాలకు ఇంకా ఎన్నో ఉద్యమాలకు అంకిత భావంతో చేయూతనందించారు. తెలంగాణ ఉద్యమానికి తమ పత్రికా కథనాల ద్వారా మద్దతునిచ్చారు. అందుకే జహీర్ ఖాన్ మరణం తెలంగాణలోని ఉర్దూ జర్నలిజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కెసిఆర్ తమ సంతాపం తెలియజేశారు.

ఉన్నత కుటుంబంలో పుట్టిన జహీర్ ఖాన్ జీవన లక్ష్యాల్లో విలువలు గల పాత్రికేయ వృత్తితో పాటు దాతృత్వం కూడా ఉంది. పేదల సామాజిక అభివృద్ధి కోసం ఆయన కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలను పరిశీలిస్తే ముందు దాత ఆ తర్వాతే కలం యోధుడని అనక తప్పదు. పేదల బ్రతుకులో చూసి కరిగిపోయే గుణం ఆయనది. చేతనయిన సాయం చేయడానికి తొలి అడుగు తానే వేసేవారు. తనలాంటి దయార్ద్ర హృదయులను ఏకం చేసి ఎన్నో సంస్థలను నెలకొల్పారు. మైనారిటీ డెవలప్‌మెంట్ ఫోరం స్థాపించి పేదలకు ఎనలేని సేవలందించారు. ఎందరో పేద మహిళలకు ఇంగ్లీష్ మాట్లాడడంలో, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బతుకు తోవ చూయించారు. కరోనా సమయంలో వందలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. బిజెపి, ఎంఐఎం మతవాద పార్టీలకు యువత దూరంగా ఉండాలని పాతబస్తీ యువకులకు బోధిస్తూ, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను ఆరంభించారు. ఆధునిక విద్య వైపు యువతి, యువకులను మళ్ళించడం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలో జరిగే అనేక ప్రగతి కాముక కార్యక్రమాల సకల ఖర్చులను భరించేవారు.

తాను స్థాపించిన సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా బీహార్, గుజరాత్ , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ , ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని 22 వేల మంది పేదలకు రూ. 4 కోట్ల దాకా ఆర్థిక సహాయం అందించారు. అబిద్ అలీ ఖాన్ ట్రస్ట్ ద్వారా 1994 నుండి చదువులో రాణిస్తున్న పేద పిల్లలకు పై చదువుల కోసం సాయపడుతున్నారు. 1997లో మైనారిటీ డెవలప్ మెంట్ ఫోరమ్ స్థాపించి మురికివాడల్లో ఉండే వారికి నెలవారీగా ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణి కోసం ఒక కార్పొరేట్ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్నారు.

2002లో స్పోకెన్ ఇంగ్లిష్‌లో తరగతులు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల విద్యార్థులకు వివిధ పెద్ద కంపెనీలో ఉద్యోగాలు పొందేలా కృషి చేశారు. వికారాబాద్‌లో వయసుడిగిన అనాథల కోసం సుకూన్ అనే వృద్ధాశ్రమాన్ని నెలకోల్పారు. 2007లో మొదలుపెట్టి ఇప్పటికీ 7 వేల కట్న ప్రసక్తిలేని వివాహాలను అతను ముందుండి జరిపించారు. ఎన్నో ముస్లిం అనాథ శవాలకు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. దేశంలో మతాల వైషమ్యంతో పెచ్చరిల్లుతున్న అల్లర్లకు కలత చెంది బాధిత ముస్లింలకు అన్ని విధాలా అండగా నిలిచి ఆర్థికంగా తోడ్పడేవారు. ఫిబ్రవరిలో హర్యానాలోని భివాని ప్రాంతంలో కారులో కాలిపోయి చనిపోయిన నాసిర్, జునైద్ బాధిత కుటుంబాలకు హైదరాబాద్ నుండి విరాళాలు సేకరించి అందించారు. 2017లో బీహార్ వరద బాధితులకు, 2021లో త్రిపురలో చెలరేగిన హింసలో నష్టపోయినవారికి తనవంతు సహాయాన్ని పంపారు.

సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ పాత్ర పోషిస్తూ ఇన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో గొప్ప విషయం. భిన్న పాత్రల అరుదైన కలయిక ఇది. హైదరాబాద్‌లోని సామాజిక మేధావులతో అన్ని సందర్భాల్లోనూ, వేదికలపైనా భుజం భుజం కలిపి నడిచే ప్రజాస్వామ్యవాది జహీరుద్దీన్ అలీ ఖాన్ మరణం ఒక అశనిపాతమే. గద్దర్ మరణానికి ఒక రోజు ముందు జరిగిన విద్వేషపు ‘విషగురు’ పుస్తకావిష్కరణ సభకు హాజరై అందరినీ పలకరించిన ఖాన్ సాబ్ మాటకు చూపుకు అందనంత దూరం తరలిపోతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే మాట భౌతికంగా అతికే మహనీయుడు జహీర్ ఖాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News