Monday, December 23, 2024

అంగరంగ వైభవంగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ ఈ నెల 6న ప్రమాణం చేయనున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్2గత ఏడాది సెప్టెంబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్3 బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సంప్రదాయకంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం ఈ నెల 6న జరగనుంది. వెస్ట్‌మినిస్టర్ అబేలో జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్చిబిషప్ ఆఫ్ కాంటెర్‌బరీ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 1953 జూన్ 2న రాణిగా ఎలిజబెత్ పట్టాభిషేకం జరిగిన తర్వాత 70 ఏళ్లకు మళ్లీ ఈ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుండడం గమనార్హం. ఈ పట్టాభిషేక మహోత్సవానికి దేశ విదేశాలకు చెందిన 2,000 మంది అతిథులు హాజరవుతారని భావిస్తున్నారు. అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. కాగా రాజు పట్టాభిషేకానికి భారీగానే ఖర్చు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1020కోట్లు అన్న మాట. అయితే ఈ ఖర్చంతా బ్రిటీష్ ప్రభుత్వమే భరిస్తుంది.బ్రిటీష్ రాజవంశీకులు వివాహాలను సొంత ఖర్చుతో జరుపుకొంటారు. పట్టాభిషేకానికయ్యే ఖర్చు మాత్రం ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే కార్యక్రమ టీవీ ప్రసారాల హక్కులద్వారా వచ్చే ఆదాయమే భారీగా ఉండనున్నట్లు సమాచారం. ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని దాదాపు 3.7 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ కార్యక్రమం కోసం 700 ఏండ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ సింహాసనాన్ని కూడా సిద్ధం చేశారు.కింగ్ ఎడ్వర్డ్‌నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు ఈ సింహాసనంపై కూర్చునే పట్టం కట్టుకున్నారు.శిథిలావస్థకు చేరుకున్న దీనిని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. తర్వాత అనూచానంగా వస్తున్న రాజలాంఛనాలను ఒక్కటొక్కటిగా చార్లెస్ అందుకొంటారు. వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు అందజేయడం విశేషం. అంతేకాదు ఈ వేడుకలకు క్రైస్తవులే కాకుండా వివిధ మతాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించారు. సమకాలీన బ్రిటన్ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్చి బిషప్ జస్టిన్ వెల్బీ చెప్పారు.

సెయింట్ ఎడ్వర్డ్ కిరీట ధారణ
ఆ తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్ర ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్‌ల చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. సెంట్ ఎడ్వర్డ్‌కు చెందిన ఈ కిరీటం పూర్తిగా బంగారంతో తయారు చేశారు. దీని బరువు ఐదు పౌండ్లు ఉంటుంది. ఈ కిరీటాన్ని కింగ్ చార్లెస్2 పట్టాభిషేకం కోసం 1661లో తయారు చేశారు. అప్పటినుంచి దీన్ని టవర్ ఆఫ్ లండన్‌లో భద్రంగా భద్రపరిచారు. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరి చేశారు. ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటుగా కామన్వెల్త్ దేశాలన్నిటి పేర్లుంటాయని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సాదా సీదా కార్యక్రమంలో చార్లెస్ సతీమణి కెమిల్లాను రాణిగా ప్రకటించే కార్యక్రమం ముగుస్తుంది. కెమిల్లా కూడా పట్టాభిషేక సమయంలో బ్రిటీష్ రాణులు ధరించే కిరీటాన్ని ధరిస్తారు.

డ్రెస్‌కోడ్‌లో మార్పులు

గతంలో సాధారణంగా పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యే అతిథులంతా పైనుంచి పాదాల దాకా వెల్వట్‌తో కుట్టిన ప్రత్యేక వస్త్రాలను ధరించే వారు. అతిథుల హోదాను బట్టి ఈ దుస్తుల స్టైల్ వేరుగా ఉండేది. అయితే ఈ సారి మాత్రం దీనికి కాస్త మినహాయింపు లభించింది. ప్రతి సంవత్సరం పార్ల్లమెంటు ప్రారంభమయ్యే సమయంలో ధరించే మామూలు బిజినెస్ వస్త్రాలను ధరించాలని చార్లెస్ అతిథులను కోరినట్లు ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. అలాగే చార్లెస్ వస్త్రధారణలో కూడా మార్పు ఉంటుంది. గతంలో పట్టాభిషేక సమయంలో రాజు సంప్రదాయంగా గుర్రపు స్వారీ కోసం ధరించేలాంటి పట్టు వస్త్రాలను ధరించే వారు. అయితే ఈ సారి చార్లెస్ తన మిలిటరీ యూనిఫామ్‌ను ధరిస్తారు. కాగా పట్టాభిషేక కార్యక్రమం సుదీర్ఘంగా కాక సమయాన్ని కుదించాలని కూడా చార్లెస్ కోరినట్లు తెలుస్తోంది. మొత్తం పట్టాభిషేక కార్యక్రమం గంట సమయంలోనే ముగుస్తుంది. గతంలో ఎలిజబెత్ రాణి పట్టాభిషేక కార్యక్రమం మూడు గంటలకు పైగా కొనసాగింది.

భారత్ తరఫున ఉపరాష్ట్రపతి ధన్‌కర్
ఇదిలా ఉండగా కింగ్ చార్లెస్3 పట్టాభిషేక కార్యక్రమానికి మన దేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ హాజరవుతారు. ఈ నెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు లండన్‌లో పర్యటించే ధన్‌కర్ భారతప్రభుత్వం తరఫున పట్టాభిషేక కార్యక్రమానికి హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News