జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కింగ్ ఆఫ్ గోల్కోండ’. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఈ చిత్రం లోగో ఆవిష్కరణ రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఆర్.కె.ఫిలింస్ పతాకంపై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “మహనీయుడు సర్వాయి పాపన్న జీవితంపై రామకృష్ణ గౌడ్ సినిమా చేయడం చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్న గురించి అందరికీ తెలిసేలా ఈ సినిమాను గొప్పగా తీయాలని కోరుకుంటున్నా”అని అన్నారు. డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ “బహుజన బాంధవుడు సర్వాయి పాపన్న జీవిత చరిత్రను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసున్నాం. లండన్ లైబ్రరీలో పొందుపరిచి ఉన్న పాపన్న చరిత్రను తెప్పించి ఎంతో అధ్యయనం చేసి ఈ కథ తయారు చేశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పల్లె లక్ష్మణరావు, ఏ.గురురాజ్, అలేఖ్య, మాధవి, గెహన, వాన్య అగర్వాల్ పాల్గొన్నారు.