దుబాయ్ నుంచి వచ్చిన ఉమేశ్ వర్మకు సంకెళ్లు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో కనీసం 45 మందిని రూ. 2.5 కోట్ల వరకు మోసం చేశారన్న ఆరోపణలపై దుబాయ్ నుంచి ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఉమేశ్ వర్మ అనే 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2017లో ఉమేశ్ వర్మ, ఆయన కుమారుడు భరత్ వర్మ వర్చువల్ కరెన్సీ లావాదేవీలకు సంబందించిన దేశంలో మొట్టమొదటి మొబైల్ అప్లికేషన్ ప్లూటో ఎక్స్‌చేంజ్ నెలకొల్పారు. కేవలం మొబైల్ నంబర్ ద్వారా ప్రజలు బిట్ కాయిన్లను కొనడం, అమ్మడం, నిల్వచేయడం, ఖర్చు చేయడం వంటివి చేసే పథకాన్ని ఆ సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రారంభించారు. ప్రతి నెల 20 నుంచి 30 శాతం లాభాలు అందచేస్తామని వారు వాగ్దానం చేసినట్లు పెట్టుబడిపెట్టిన 45 మందిలో ఒకరు తెలిపారు. మరింత మందిని ఈ పథకంలో చేర్పిస్తే ఇన్వెస్టర్లకు మరింత కమిషన్ అందచేస్తామని కూడా ప్రమోటర్లు వాగ్దానం చేశారు. కాగా..ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ప్రమోటర్లు విఫలం కావడంతో కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం సీజ్ చేసింది. అనంతరం ప్లూటో ఎక్స్‌చేంజ్ తన కార్యాలయాలను దుబాయ్‌కు తరలించి అక్కడి నుంచి ఇదే విధమైన కార్యకలాపాలు ప్రారంభించింది.