పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్‌గా తెలంగాణ
గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో మునిగి తేలుతున్న లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వటు పడింది, కిరణ్ బేడీని లెఫ్టెనెంట్ గవర్నర్ బాధ్యతలను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కాగా పుదుచ్చేరి అదనపు బాధ్యతలను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు అప్పగిస్తూ, రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. అయితే కిరణ్ బేడీని హటాత్తుగా తప్పించడం వెనుక కారణాలేమిటో వెంటనే తెలియరాలేదు. అయితే తమిళనాడు, కేరళ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్రం ప్రోద్బలంతో కిరణ్ బేడీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే కేంద్రం ఆమెను పదవినుంచి తప్పిస్తూ హటాత్తుగా నిర్ణయం తీసుకొని ఉంటుందని భావిస్తున్నారు. నలుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు మంగళవారం రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలోని ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ షాక్‌నుంచి పుదుచ్చేరి రాజకీయ నాయకులు తేరుకోకముందే కిరణ్ బేడీ తొలగింపు వార్త మరో షాక్ ఇచ్చింది.