Wednesday, January 22, 2025

శాం పిట్రోడాకు బాధ్యతలు.. మోడీజీ ఆనాడే చెప్పారు: కిరణ్ రిజిజు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నేత శాం పిట్రోడాకు పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇలా జరుగుతుందని ప్రధాని మోడీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. “రూపు రేఖలను ఉద్దేశిస్తూ భారతీయులను అవమానపర్చిన రాహుల్ గాంధీ సలహాదారును (పిట్రోడా) మళ్లీ కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు. ఇది మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే ప్రధాని మోడీ దీన్ని ముందుగానే ఊహించారు. ”అని రిజిజు రాసుకొచ్చారు. దీంతోపాటు ఓ ఇంటర్వూలో మోడీ మాట్లాడుతున్న వీడియోను జత చేశారు.

అటు బీజేపీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది. “కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్‌తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు. అమెరికా లోని వారి గురువు (పిట్రోడా ) విషయం లోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు , ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి” అని మోడీ ఆ వీడియోలో అన్నారు.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తొలుత వారసత్వ పన్ను విధానం గురించి మాట్లాడిన ఆయన, ఆ తర్వాత భారతీయుల రూపురేఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాదివాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు” అంటూ ఆయన చేసిన పోలికపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ క్రమం లోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News