Friday, December 20, 2024

కేంద్ర క్యాబినెట్‌లోకి కిషన్‌రెడ్డి, బండి సంజయ్..?

- Advertisement -
- Advertisement -

ఏపిలో రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్..?

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్రంలో మూడోసారి ఏర్పడబోయే మోడీ నేతృత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎంపిల్లో ఇద్దరికి బెర్త్ ఖాయమని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 9 ఆదివారం వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పదవుల కోసం రాష్ట్ర బిజెపి ఎంపిలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపిలకు ప్రధాని మోడీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్లు అయిన సికింద్రాబాద్ ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఈసారి మంత్రి పదవులు ఇచ్చేందుకు కేంద్ర నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక ఎంపీకి కేబినెట్ హోదాలో, మరొకరికి రాష్ట్ర మంత్రిగా స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో ఒక వేళ చోటు దక్కకపోతే, అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన బిజెపి పార్లమెంటరీ బోర్డులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బిసి వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కు మంత్రి పదవి ఇచ్చి బిసిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది. ఇదిలావుంటే మంత్రి పదవుల రేస్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఇద్దరు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ మహిళ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపి స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో బిజెపి జెండా పాతిన ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు సమాచారం. కాగా ఛాలెంజింగ్‌గా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్‌రావుకు కేంద్ర మంత్రి పదవి కాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఊహాగాలన్నింటికి 9వ తేదీ ఆదివారం తెరపడుతుంది.

ఏపి నుంచి రామ్మోన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్…?

కేంద్రంలో ఏర్పడబోయే నూతన ఎన్‌డియే మంత్రివర్గంలో ఆంధప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపిలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్మోహన్‌నాయుడుకు కేబినెట్ హోదా, పెమ్మసానికి సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం. కాగా కేంద్రంలోని ఎన్‌డియే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు అడిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి 16 లోక్ సభ స్థానాల్లో గెలుపొందగా నాలుగు మంత్రి పదవులు, స్పీకర్ పదవిని కోరిందని తెలుస్తోంది. దీనిపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఏపీ విషయానికి వస్తే కూటమి నుంచి 21 మంది ఎంపీలు గెలుపొందారు. టీడీపీ నుంచి 16మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు గెలుపొందారు.

మొత్తంగా చూసుకుంటే 25 ఎంపీ స్థానాల్లో 21 మంది ఎంపీలు ఎన్డీయే నుంచే ఉన్నారు. వాళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉండి ఎన్డీయేలో కీలకంగా ఉన్న జనసేనకు కూడా ఒక బెర్త్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే బిజెపి నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. వారిలో పురంధేశ్వరి లాంటి సీనియర్ నేత ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్ కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో వీరిద్దరిలో ఒకరికి అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కే అవకాశం ఉందనేది కూడా 9వ తేదీ ఆదివారం తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News