హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బిసి కులాలను అవమానించారని కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి గురువారం రోపించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసి వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపిచేసిన వాగ్దానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుపట్టారు.
తెలంగాణలో 2 శాతం ఓట్లు మాత్రమే పొందే బిజెపి బిసి ముఖ్యమంత్రిని ఎలా చేయగలదని రాహుల్ గాంధీ ప్రశ్నించడం ఆయన అహంకారాన్ని తెలియచేసోతందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు తెలంగాణలోని బిసి వర్గాలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామన్న తమ పార్టీ విధానాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, బిజెపిని విమర్శించడం మాత్రమే కాదు శ్రమపైనే ధారపడి జీవించే వెనుకబడిన వర్గాల ఆకాంఓలను అవమానించడమేనని ఆయన అన్నారు.
తెలంగాణ జనాభాలో 55 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ఆశలను సుదీర్ఘ కాలంగా కలగా మారిన బిసిల రాజ్యాధికార ఆకాంక్షలను, వారి సామాజిక, రాజకీయ లక్ష్యాలను పూర్తి చేసే దిశగా బిజెపి పనిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. బిసి వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రథానమంత్రి అయితే సహించలేని రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలోని వెనుకబడిన వర్గాల ప్రజలను ఇలాగే అవమానిస్తూ పోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లకు పరిమితం కావడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.