Friday, December 20, 2024

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామనడం కిషన్ రెడ్డి అవివేకం

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని మాట్లాడటం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రగల్భాలు పలకడం ఆయన అవివేకానికి నిదర్శనమని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, 2018 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇక్కడ ఒకే ఒక్క సీటు గెలిచిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన బిజెపి నాయకులు బొక్కా బోర్లా పడ్డారని, మళ్లీ రానున్న ఎంపి ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుస్తామని మాట్లాడటం కిషన్ రెడ్డి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం కాదా? అని సుధాకర్ గౌడ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ – బిఆర్‌ఎస్ ఒక్కటే అని మాట్లాడుతున్న కిషన్ రెడ్డి లిక్కర్ రాణి ఎమ్మెల్సీ కవితను వదిలిపెట్టబోమని ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి హెచ్చరించిన బిజెపి నాయకులంతా ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ తెలుసన్నారు. రాజకీయ లబ్ధి కోసం బేరసారాలతో లిక్కర్ కేసును తాత్కారం చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమేనన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ రహస్య మిత్రులని జగమంతా తెలుసునని, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాల అమలు చేసి తీరుతామని సుధాకర్ గౌడ్ అన్నారు. హామీల గారడీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపిని రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పంటలకు మద్దతు ధర కోరుతూ ఢిల్లీలో మలిదశ ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఖర్కశంగా వ్యవహారిస్తోందని బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మతతత్వ రైతు వ్యతిరేక బిజెపికి ఓటుతో బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News