Sunday, November 17, 2024

ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై
సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్
సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట
పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం
చేసుకున్నారా? లేదా? అనేది కెసిఆర్ చెప్పాలి
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారీగా జరిగిందని, బాధ్యులైన అధికారులకు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోందన్నారు. రాజకీయపరమైన వ్యక్తులపై, అధికారులపై, వ్యాపారస్తులపై, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని , ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బిఆర్‌ఎస్‌పాలనలో ఒక వెలుగువెలిగిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు తమకు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు. దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారన్నారు. దేశ భద్రత, ఉగ్రవాదుల విషయంలో మాత్రమే ఉన్నతాధికారుల అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుందని, కానీ అవినీతి కుంభకోణాలకు పాల్పడటం, వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం దుర్మార్గం అని కిషన్ రెడ్డి విమర్శించారు.

బిఆర్‌ఎస్ పాలనలో 2019లో పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా భారతీయ జనతా పార్టీకి చెందిన వైట్ మనీ బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వస్తుండగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని మార్గమధ్యలో టెర్రరిస్టుల మాదిరిగా చుట్టుముట్టి.. మా ఆఫీసుకు సంబంధించిన క్లర్కులను పట్టుకుని మాఫియా మాదిరిగా వ్యవహరించారని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడి, బ్లాక్ మెయిలింగ్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అరెస్టుపై కిషన్ రెడ్డి స్పందిస్తూ .. బిజెపి కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులతో అరెస్ట్ చేశారంటూ బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడారు..ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారా లేదా..? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను పెట్టారా లేదా..?

తన కనుసైగల్లో వ్యాపార సంస్థను నడిపిస్తూ.. ఢిల్లీలోఆప్ పార్టీ ప్రభుత్వంతో మంతనాలు జరిపారా.. లేదా..? కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా..? ఈ విషయంపై ముందు కేసీఆర్ సమాధానం చెప్పాలి అని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఇవన్నీ ఢిల్లీలో జరిగిన ఆప్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగమేని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు, తెలంగాణ సెంటిమెంటుకు…ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అరెస్టుకు తమ బిజెపికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత జోక్యం లేనట్లయితే, ఇది అక్రమ కేసు అయితే, రాజకీయపరమైన కక్షసాధింపు కేసు అయితే….

కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి నిరూపించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో నిజాంను పొగుడుతూ, నిజాం పోకడతోనే పాలన చేశారు తప్పితే ఏనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆ ప్రభుత్వం పనిచేయలేదన్నారు. అయితే మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం ఇంకా అధికారంలో ఉన్న్లట్లుగానే భావిస్తున్నారని ..బిఆర్‌ఎస్ నాయకుల కాళ్లకింద భూమి కదిలిపోతున్నా.. అబద్ధాలు, ఆరోపణలు చేయడంమాత్రం మానలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో కెటిఆర్ కుటుంబాన్ని మించినవారే లేరన్నారు.

ప్రజలను మభ్యపెట్టే మాటలతోనే పదేండ్ల పాటు వారు పాలన చేశారన్నారు. పదే పదే భారతీయ జనతా పార్టీపై బిఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు అని, బిజెపిని విమర్శిస్తే ఊరుకునేది లేదని కిషన్ రెడ్డి అన్నారు.
దు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రజలు ముందుంచుతాం. లిక్కర్ స్కాంలో కవిత కడిగిన ముత్యంలా తిరిగొస్తామని చెబుతున్నారని .. మరి ఏ రకంగా కడిగిన ముత్యంలా తిరిగివస్తారో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నారు. మొన్న హోలీ పండుగ సందర్భంగా చంగిచర్ల స్లాటర్ హౌస్ దగ్గర నివాసం ఉంటున్న గిరిజన మహిళలు వేడుకలు జరుపుకుంటు స్థానిక మసీదు నుంచి కొంతమంది మతోన్మాదులు వచ్చి విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసి గాయపర్చారని, గర్భిణీలు, చిన్నపిల్లలపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారే తప్ప దోషులపై చర్యలు తీసుకోలేదన్నారు. హత్యానేరం కింద అరెస్ట్ చేయాల్సిన కేసులు కాకుండా నామమాత్రపు కేసులతో ముగించారని మండిపడ్డారు. హిందువులపై, పేద మహిళలపై, గిరిజన ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు.

బాధిత మహిళలను కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గిరిజన ఆడబిడ్డలను పోలీసులు కొట్టే ప్రయత్నం చేశారని, చంగిచర్లలో గత 30 సంవత్సరాలుగా నేర సామ్రాజ్యం నడుస్తోందని అన్నారు. అన్నింటికీ మించి మజ్లిస్ పార్టీ గూండాలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రాజకీయపరమైన ఒత్తిళ్లకు లొంగకూడదని, కాని చంగిచర్లలో పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. చంగిచర్లలో స్లాటర్ హౌస్ అక్రమమైనదని, అక్కడ ప్రతిరోజు ఆవుదూడలు, గోవులను వధిస్తున్నారన్నారు. కబేళా నుంచి వస్తున్న రక్తంతో అక్కడ గ్రౌండ్ వాటర్ కలుషితమైందన్నారు. అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట జరిగిన రోజున కూడా హిందువులపై దాడులకు పాల్పడ్డారన్నారు. ఆ ఘటన బయటకు తెలియకుండా పోలీసులు నొక్కిపెట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేపర్ ప్రకటనలకే పరిమితమవ్వడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. దోషులను ఇప్పటికైనా అరెస్టు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News