మారింది పాలకులే..పాలన కాదు
హామీలు అమలు చేయకుండా
విజయోత్సవాలా? భాష
మార్చుకుంటేనే రేవంత్‌తో
నిర్మాణాత్మక అంశాలపై చర్చకు
సిద్ధం ఫార్మాసిటీపై కాంగ్రెస్
అప్పుడో మాట, ఇప్పుడో బాట
కాంగ్రెస్‌పై బిజెపి ఛార్జిషీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంతోమంది ప్రాణత్యాగాలతో, తెలంగాణ ప్రజలు ఏ ఆశయాల కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారో ఆ ఆశయాలకు విరుద్ధంగా గతంలో బిఆర్‌ఎస్ కుటుంబ పాలన, అహంకార పూరితంగా కేసీఆర్ పాలన కొనసాగించారో అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అబద్దాల హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుందని ఆరోపించారు. వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన హామీలను నేటికీ అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో హామీల అమల్లో వైఫల్యాలపై కిషన్ రెడ్డి ఆదివారం చార్జిషీట్‌ను విడుదల చేశారు. ‘ఆరు అబద్ధాలు-, 66 మోసాలు, కాంగ్రెస్ గ్యారంటీల గారడి’ పేరుతో బిజెపి నేతలు చార్జిషీట్‌ను ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్ ఎంపి డికె ఆరుణ చార్జిషీట్‌ను ఆవిష్కరించగా వేదికపై కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎంపిలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, బిజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆరు గ్యారంటీల అమల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. హామీల వారీగా ప్రభుత్వం ప్రజలకు అమలు చేయకుండా మోసం చేసిన వైనంపై కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారన్న ఆయన పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలన ఒకే విధంగా ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే ప్రజల తరపున బీజేపీ ప్రశ్నించడానికి సిద్ధమైందని, తాము విడుదల చేసిన ఛార్జిషీట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడాది 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 9న సోనియా గాంధీ జన్మదినం రోజు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకా పూర్తిగా రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ఎన్నికల్లో పది రకాల పంటలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాకా కేవలం ధాన్యానికి మాత్రమే ఇస్తామని చెప్పడం మోసం చేయడం కాదా అని నిలదీశారు. మూడు లక్షల వడ్డీ పంట రుణాలు ఇస్తామన చెప్పారని, దానికి అతి గతి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పోరాటం చేసిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళుతోందని అన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేయలేదని, ఈ కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మారింది పాలకులే పాలన కాదు
దోపిడీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు కాదని చార్జిషీట్‌లో దుయ్యబట్టారు. అప్పుడు కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ, ఇప్పుడు మూసీతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టారని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో కే-ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామాన్యానికి పాతరేస్తూ బీఆర్‌ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను గతంలో గుంజుకుంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందని విమర్శించింది.
ధరణితో 10 లక్షల రైతుల భూములను బీఆర్‌ఎస్ మాయం చేస్తే, ఇప్పుడు హైడ్రా, ఫోర్త్ సిటీ పేరుతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని ఆరోపించింది. ఇక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచితే ఇప్పుడు ఏడాదిలోనే రూ. 80 వేల కోట్ల అప్పులను రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఆడ పిల్లలకు జీరో వడ్డికే రుణాలు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ మోసం చేస్తే, స్కూటీ, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో మహాలక్ష్మి పేరుతో మోసం, చీకట్లు నింపిన గృహజ్యోతి, అందని చేయూత, రైతుకు రాని భరోసా, కలగానే సొంతిండ్లు, కానరాని యువ వికాసం నిలిచిపోయిందని ఆయన చార్జిషీట్‌లో విమర్శల దాడి చేశారు.
సిఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా
కాంగ్రెస్ పార్టీ రైతు పండుగ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాల్లోని అమిస్తాపూర్ ప్రాంతంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందని, నమ్మకం లేని వాళ్ళు తమతో చర్చకు రావాలని సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎన్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఎవరొస్తారో రండి, విడివిడిగా అయినా, కలిసికట్టుగా వచ్చినా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చేసిన రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని చార్జిషీట్ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం హోదాలో ఉన్న రేవంత్ తన భాషను మార్చుకుంటేనే చర్చకు వస్తానని కిషన్ రెడ్డి షరతు విధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, గ్యారెంటీలు, డిక్లరేషన్ పేరుతో ఆయా వర్గాలను నమ్మించిందో ఆ ఆంశాలపై తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేశామని తెలిపారు. 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారని, అయితే ఈ ఏడాది కాలంలో మీరిచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు వచ్చాయని అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిగ్గు తేల్చాలంటే రెండు రోజులు పడుతుందని, తాను ముఖ్యమైన అంశాల జోలికి మాత్రమే వస్తున్నానని అన్నారు.