భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఉత్తరాది, దక్షిణాది అంటూ కుట్ర
చెన్నైలో డీలిమిటేషన్ సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నెర్ర
మ న తెలంగాణ/హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలే ఇంకా ఖరారు కాకుండా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ కొన్ని పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నంపై మండి పడ్డ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడి ‘ఆలూ లేదు.. చూలూ లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంద’ని వ్యాఖ్యానించారు. చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు శనివారం నాడు సమావేశమవడం పట్ల కిషన్‌రెడ్డి కన్నెర్ర చేశారు.
ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి అజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యారెంటీల హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. అటు బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయిందని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆ పార్టీలపై కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
మోడీ వచ్చాక కాంగ్రెస్ రోజు రోజుకీ దిగజారుతోంది
2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని వ్యాఖ్యానించారు. వరుసగా మూడోసారి మోడీ అధికారంలోకి రావడమే కాదు, 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా, మరో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయని తెలిపారు. బీజేపీ రోజురోజుకు విస్తరిస్తూ ఉంటే, కాంగ్రెస్ కుచించుకుపోతుందన్న కిషన్‌రెడ్డి నేడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితం కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందని కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. వివిధ ఎజెండాలతో సమాజంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో జేఎన్‌యులో తుక్డే తుక్డే గ్యాంగ్‌ను ముందుపెట్టి విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమైందని, ఆ తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిందని తెలిపారు.
అవేవీ పారకపోవడంతో ఇప్పుడు డీలిమిటేషన్ కింద దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ సరికొత్త కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ముందు పెట్టి ఉత్తర- దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.డీలిమిటేషన్‌లో తమిళనాడుకు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న మరో కృత్రిమ వాదాన్ని స్టాలిన్ సృష్టించారని అన్నారు. దీనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు తదితర పక్షాలు తందానా అంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే అన్న మా ఆరోపణలు నిజమని మరోసారి నిరూపితమైందని కిషన్‌రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలను సంప్రదించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, దేశహితమే లక్ష్యంగా డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొస్తారని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.