Thursday, December 19, 2024

సంచలనం చేయడానికే అల్లు అర్జున్ అరెస్టు:మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

అదానీతో వాణిజ్య ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం నాడు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. ఢిల్లీలో బుధవారం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి అదాని ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?, వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఒక సాక్ష్యం చూపిస్తారా? మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజల ముందు ఆధారాలు చూపించకుండా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నిరూపించగలదా..? మాటమీద నిలబడే సత్తాలేక విమర్శలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

దేశం కోసం ఏమైనా చేస్తామంటున్న రేవంత్ రెడ్డి, ఆధారాల్లేకుండా మాట్లాడితే కాంగ్రెస్ చర్యలను ఎవరూ స్వాగతించరని అన్నారు. వరుసగా ఎన్నికల్లో ఓటమిపాలవుతుండటంతో ప్రజల్లో ప్రాబల్యాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాని అవుదామని వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయి ప్రజామద్దతు లేని కారణంగా నిరాశ, నిస్పృహలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యవహార శైలి చూస్తే ఆయన నిరాశ నిస్పృహలు అర్థమవుతున్నాయని తెలిపారు. ఏడాదిగా పాలనలతో సరైన పాలన లేదని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ ముందుడుగు పడటం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డి, కేసీఆర్ నాణానకి బొమ్మ బొరుసు
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, కెసిఆర్‌లు నాణానికి బొమ్మ బొరుసు వంటి వారేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తులేనని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?, అందుకే రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్‌ఎస్ పాట పాడుతున్నాడా? అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆ రెండు పార్టీల పనిచేసే తీరు ఒక్కటేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మూకుమ్మడిగా ప్రజాతీర్పును అగౌరవపరిచిన పార్టీలు నాడు బీఆర్‌ఎస్, నేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను పిఏసి చైర్మన్ గా, ఎంపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ నియమించడం కంటే బలమైన దోస్తీ ఉంటుందా? అని చురకలంటించారు. కెసిఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ మారిస్తే, రేవంత్ రెడ్డి మరింత దిగజారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు, ఎప్పుడు అప్పులిస్తరో తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. రూ.7.5 లక్షల కోట్లు అప్పులు కేసీఆర్ చేస్తే, ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.80 వేల కోట్ల అప్పులు రేవంత్ రెడ్డి చేశారని ధ్వజమెత్తారు.రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ సంకెళ్లు వేస్తే రేవంత్ కూడా అదే స్థాయిలో రైతులను అరెస్టు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.

సంచలనం చేయడానికే అల్లు అర్జున్ అరెస్టు
రాష్ట్రంలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికే హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారని కిషన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలడొట్టం, మూసీ సుందరీకరణతో పేదల ఇండ్లు కూలగొట్టడం ఏమిటని నిలదీశారు. హైడ్రా పేరుతో ఇప్పటివరకు కూల్చిన ఇండ్ల సంగతేందని ప్రశ్నించారు. మూసీలో ఏడాదిపాటు ఇండ్లు కూలుస్తారనే భయంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు గడిపిన నిద్రలేని రాత్రులకు పరిహారం ఎవరిస్తారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కేసుల్లో విచారణ ఎక్కడిదాకా వచ్చింది?, సమగ్ర దర్యాప్తు ఎందుకు ఆదేశిండం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ కోనుగోళ్లలో అవినీతి ఎక్కడిదాకా వచ్చిందని ప్రశ్నించారు. అవినీతి విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరగాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News