Tuesday, January 21, 2025

గో..గో..గోవా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.700 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 2025 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేల అభివృద్ధికి, ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వందే భారత్ రైళ్ల సేవలను అత్యధిక సంఖ్యలో నడుపుతున్న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ రెండవ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ నుంచి గోవా (వాస్కో-డ -గామా)కు వారానికి రెండు రోజులు పాటు నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రైల్వేలకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ సాక్ష్యంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ రాజధాని నుంచి గోవాకు ప్రత్యేక రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామాకు వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక రైలును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రాంతాలైన కర్నూలు, ధోన్, గుంతకల్లు ప్రజలకు గోవా మార్గంలో సౌకర్యం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. గోవాతో పాటు, బళ్లారి, హోస్పేట్, హుబ్బాలి, ధార్వాడ్ , లోండా మొదలైన కర్ణాటకలోని ప్రధాన నగరాలకు ప్రయాణించాలనుకునే ప్రజలకు కూడా ఈ రైలు సేవలు అందిస్తుందని వివరించారు. హైదరాబాద్, కాచిగూడ వంటి జంట నగరాల్లోని ప్రధాన టెర్మినల్ స్టేషన్లను కూడా ఆధునిక మౌలిక సదుపాయాలతో పునరాభివృద్ధి చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, గత పదేళ్లలో తెలంగాణలో 346 కిలోమీటర్ల కొత్త లైన్లు, 383 కిలోమీటర్ల డబుల్ లైన్, మూడవ లైన్, నాల్గవ లైన్ వేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

గత పదేళ్లలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 1,828 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరించబడిందని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నుండి గోవాకు నేరుగా కొత్త రైలును ఏర్పాటు చేసినందుకు రైల్వే అధికారులను అభినందించారు. తొలుత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్వాగతోపన్యాసం చేశారు. గోవాకు కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడం చాలా ముఖ్యమైన సందర్భమని అన్నారు. ఈ రైలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటూ సౌలభ్యంతో అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గోవాతో మాత్రమే కాకుండా కర్ణాటకలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలతో కూడా అనుసంధానిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపులో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News