Thursday, February 27, 2025

భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 800 ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. బుధవారం నాడు బయో ఏషియా- 2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22వ ఎడిషన్ బయో ఆసియా -2025 లాంటి గ్లోబల్ కార్యక్రమం నగర వేదికగా జరగడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్‌లో ఐఐటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్), సీసీఎంబీ, ఐఎస్బీ, నల్సార్, డీఆర్డీవో వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ప్రతిభావంతులైన యువకులు ఆయా రంగాల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులు హబ్‌గా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కొనియాడారు. హెల్త్ సైన్స్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని గుర్తుచేశారు. పదేళ్లలో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు రెట్టింపు అయిందన్నారు. 2014లో 15 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2024లో ఇది 27.85 బిలియన్ డాలర్లకు పెరిగిందని అన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా అడుగులు వేసే అవకాశాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమిచ్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో వినూత్నమైన ఆవిష్కర్తలకు కేంద్ర మంత్రి బహుమతులు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News