హైదరాబాద్: బిజెపి పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని, ప్రస్తుతం పాకిస్థాన్‌లో తినిడానికి తిండి లేక బిక్షమెత్తుకుంటుందన్నారు. బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నామని, రూ.1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించామని, 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించామని, 13 కోట్ల ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశామని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తయారవుతోందని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేదే బిజెపి లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు.
బిజెపి హయాంలో ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముస్లిం సమాజం మొత్తం ఆమోదించిందని, ముస్లిం సమాజం ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడిగా చూస్తుందని కిషన్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు బిజెపి ఆశీర్వదించబోతున్నారని, ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని, అవినీతిరహిత ప్రభుత్వం కోసమే ప్రజలు 2014లో ప్రధాని మోడీకి ఓటేశారన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని బిజెపి సరిదిద్దిందని, అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్ల బిజెపి పారిపాలించిందని, బిజెపి హయాంలో మతకలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవన్నారు.