Friday, November 22, 2024

మోడీ నమ్మకం నిలబెడతా.. తెలుగు ప్రజలకు మంచి పేరు తెస్తా: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తనపై విశ్వాసం వుంచిన ప్రధాని మోడికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని అంచనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తనకు మార్గదర్శనం చేసిన అమిత్‌షాకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. హోంశాఖ సహాయమంత్రిగా అమిత్‌షా చేపట్టిన అనేక నిర్ణయాలను, అనేక రకాల చట్టాలను రూపకల్పన చేయడంలో తన వంతు ప్రయత్నం చేశానన్నారు. గడిచిన రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన అనిశ్చిత పరిస్థితి, తీవ్రవాద కార్యకలాపాల మధ్య ప్రజల జీవనం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. దీనిపై భారతీయ జనసంఘ్ కాలం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. తమ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చామన్నారు. అనంతరం సిఎఎ, హోంశాఖ నుంచి ఎన్నో బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టానని కిషన్‌రెడ్డి తెలిపారు. తన జీవితంలో ఈ రెండు సంవత్సరాలు పనిచేయడం మరిచిపోలేని సంఘటన అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తాను కీలక పాత్ర పోషించానన్నారు.

మంత్రిత్వ శాఖలో ప్రమోషన్, కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా కావాలని తాను ఎవరినీ కోరలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ నరేంద్ర మోడి, అమిత్‌షా, జెపి నడ్డాలు తనకు కేబినెట్ మినిస్టర్‌గా అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారేనని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సామాన్య కార్యకర్తలకు బిజెపిలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఎపి, తెలంగాణలకు కేబినెట్ మంత్రిగా అందుబాటులో వుంటానని కిషన్‌రెడ్డి వెల్లడింఆరు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపైనా కిషన్‌రెడ్డి స్పందించారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఘర్షణాత్మోక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy press meet after sworn as Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News