Friday, December 27, 2024

అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తామని కేంద్ర మంత్రి, బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత.. తొలిసారి బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మొదటిసారి ఎంపిగా గెలిచా. నాలుగేళ్లలో రెండేళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, మరో రెండేళ్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశాను. ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదు. మంత్రి అవుతానని.. కావాలని .. ఏదీ అడగలేదు. పార్టీయే నన్ను గుర్తించింది. ఇప్పటి వరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చాను. 1980 నుంచి ఈ రోజు వరకు పార్టీ సైనికుడిగా పనిచేశా. పార్టీకి మించింది నాకు ఏదీ లేదు.

పార్టీయే నా శ్వాస. పార్టీ కోసం.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం.8న ప్రధాని పర్యటన సందర్భంగా రెండు రోజులు వరంగల్ సభ ఏర్పాట్లపై చర్చించి.. సభను విజయవంతం చేస్తాం” అని కిషన్ రెడ్డి తెలిపారు. కాజీపేటలో రైల్వే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ పెట్టాలని మొదట్లో కేంద్ర ప్రభుత్వం భావించినా.. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద మనుసుతో కాజీపేటకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఏడాదికి 2400 వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యంతో 150 ఎకరాల్లో పరిశ్రమ రాబోతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు ఇంత పెద్ద పరిశ్రమ రావడం ఇదే మొదటిసారి అన్నారు.

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 8న హన్మకొండ ఆర్ట్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభ వేదిక నుంచే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని, దీంతోపాటు రూ. 6వేల కోట్ల విలువై జాతీయ రహదారులకు ప్రధాని భూమి పూజ చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జెపి నడ్డా ఫోన్ చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను. మరోసారి నాపై పార్టీ ఈ బాధ్యత పెట్టిందన్నారు.

9న హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం..
‘దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ చెందిన నాయకులు సమావేశానికి హాజరవుతారు. దక్షిణ రాష్ట్రాలలో బిజెపి తీసుకోవాల్సిన చర్యలు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై భేటీలో చర్చిస్తామని వెల్లడించారు.. దక్షిణ రాష్ట్రాలలో పార్టీని మరింత పటిష్టం చేయాలి.. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై సమావేశంలో చర్చిస్తాం ‘ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News