Friday, December 20, 2024

ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Kishan Reddy press meet in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కేంద్ర పాలన సాగిస్తుందని కిషన్‌రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి 58 శాతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశంలో మౌలిక వసతులు, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా వివరించారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎయిర్‌పోర్టులు, జల మార్గాలు, రైల్వేలు, రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు తగ్గించిందని ఆయన చెప్పారు.

దీంతో రూ.2 లక్షల 20 వేల కోట్లు కేంద్రం ఆదాయం కోల్పోయిందని వివరించారు. భారతదేశం తలచుకుంటే ఏమైనా చేస్తుందని నిరూపించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులను ఆయన గుర్తు చేశారు. రక్షణ రంగంలో కూడా దేశీయ ఉత్పత్తులను పెంచుకోనున్నట్లుగా చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ నుండి యుద్ధ విమానాల వరకు దేశీయ రంగంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. 2851 రక్షణ రంగానికి చెందిన పరికరాలను దేశంలోనే తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో రక్షణ రంగానికి చెందిన పరికరాలు 98 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారమన్నారు. వైద్య రంగంలో కూడా పెద్ద ఎత్తున దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇండియాలో తయారైన వ్యాక్సిన్‌ను కోరుకుంటున్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలోనే పలు దేశాలకు సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు పండించే గిట్టుబాటు ధర రూ.1360 నుండి రూ.1960కి పెంచామని గుర్తు చేశారు.

Kishan Reddy press meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News