Thursday, March 20, 2025

దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్:మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంచనాలు భారీ, కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లుందని అన్నారు. తెలంగాణ బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం స్పందించారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉందని ఎద్దేవా చేశారు. అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని చురకలు వేశారు. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారని, మరి 15 నెలల పాటు పాలించిన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారని అన్నారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా, కేటాయింపులు, ఆచరణలో శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని విస్మయం వ్యక్తం చేశారు. 2024-.25 బడ్జెట్‌లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు,

కానీ సవరించిన అంచనాల్లో రూ.5 వేల కోట్లు తగ్గించి రూ.53,665 కోట్లుగా వెల్లడించారని తెలిపారు. అంటే దాదాపు 8.5 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని సూచించారు. 2025-.26కి గాను రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. 2024-.25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు ఈసారి బడ్జెట్లో రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోందని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్‌ను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది.

ఈ బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగా ఉంది: ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగా ఉందని ఆదిలాబాద్ బిజెపి శాసనసభ్యుడు పాయల్ శంకర్ విమర్శించారు. 6 గ్యారంటీలను తుంగలో తొక్కిన బడ్జెట్ – ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-.26 బడ్జెట్ రాష్ట్రంలో ఏ వర్గాన్నీ సంతృప్తిపరచలేదని విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ స్టేజ్ లో ఉందంటూ ప్రజలను భయపెట్టారు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దోషపూరితంగా చిత్రీకరించిందని అన్నారు. రెండు రోజుల కిందట శాసనసభలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. బీసీలను ఆదుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా మాట్లాడారని, అయితే ఈరోజు బీసీలకు బడ్జెట్ లో మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News