లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తప్పదు
బిజెపితో కాదు.. కాంగ్రెస్‌తోనే రేవంత్‌రెడ్డికి ముప్పు
రేవంత్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం
రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు ఉంది
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి బిజెపితో ఎలాంటి అపాయం లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ముప్పు ఉందని స్పష్టం చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి పలువురు బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ పార్టీ కండువా కప్పి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని బిజెపి వాళ్ళు చూస్తున్నారని సీఎం రేవం త్ రెడ్డి కొండగల్ లో చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం ఎలాంటి డిస్ట్రబ్ చేయమని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో బిజెపి ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందన్నారు. మూడోసారి మోడీ భారత్ ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతాయన్నారు.
తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని , బిఆర్‌ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందని అన్నారు. దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లుగా ఈరోజు తెలంగాణలో బిఆర్‌ఎస్ పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బిల్డర్లు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు వరకు అందరూ ఆర్ ట్యాక్స్ బాధితులేనని అన్నారు. అందరూ ఢిల్లీ వెళ్ళి కోట్లాది రూపాయలు ఆర్ ట్యాక్స్ గా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. పాలకులు మారినప్పటికీ పాలనలోనూ, దోపిడీలోనూ మార్పు రాలేదన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీల డిఎన్‌ఎ ఒకటేనన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దానిని మర్చిపోయారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే అమలు చేయలేదంటే, తాజాగా రాష్ట్రపర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ మాత్రం కొత్త హామీలను ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన దేశంలో ఎప్పటికీ మారదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి 2019లో 40 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నాలుగుకు నాలుగు బిజెపియే గెలుస్తుందని, కర్ణాటకలోనూ 25 సీట్లు బిజెపియే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వద్ద అభివృద్ధిపై అజెండా లేదన్నారు. హామీలు ఎలా నెరవేరుస్తారో తెలియదన్నారు.