Wednesday, January 22, 2025

ప్రగతి భవన్‌లోనా.. ఫాం హైస్‌లోనా..!: కెసిఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశాన్ని అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని, బడ్జెట్‌పై కెసిఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీపైన చేసిన వ్యాఖ్యాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సిఎం కెసిఆర్ కేంద్రంపై బురద జల్లుతున్నారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసిఆర్ కాగ్రెస్ పార్టీని పొగిడి బిజిపి మాత్రం విమ ర్శించారని తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కెసిఆర్ సిద్ధహస్తుడని మండిపడ్డారు. నిన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన కెసిఆర్ ఇప్పుడు వారితో కలిసి నడుస్తున్నారన్నారు. ఇక దేశ ఆర్థిక స్థితిగతులు, ప్రధాని మోడీ పనితీరు తదితర అంశాలపై వివిధ లెక్కలతో సహా ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో వివరించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ వివరాలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా కిషన్ రెడ్డి స్పందిస్తూ ఈ మేరకు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ చర్చను ప్రెస్ క్లబ్‌లో పెడతావా?, అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద పెట్టుకుందామా?, ప్రగతి భవన్ లేదా ఫాం హౌస్‌లో పెడతావా అంటూ సవాల్ విసిరారు. వచ్చేటప్పుడు రాజీనామ లేఖను జేబులో పెట్టుకుని తీసుకురావాలని అన్నారు. అయినా ఎన్నికల తర్వాత ఎలాగూ రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు.

2014లో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లుగా ఉందని, ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. అసెంబ్లీలో అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణలు చేసిన సిఎం కెసిఆర్.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం మాట్లాడలేదని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుంటే గూగుల్ సెర్ఛ్ చేయండి.. అంతే కానీ బిజెపిపైనా, కేంద్రం పైనా ద్వేషంతో విష ప్రచారం చేస్తున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా? రండి అని తెగేసి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News