Friday, March 7, 2025

సేవ్ తెలంగాణ.. సపోర్ట్ బిజెపి

- Advertisement -
- Advertisement -

ఇదే నినాదంతో భవిష్యత్తులో ముందుకెళతాం వచ్చే
ఎన్నికల్లో అధికారం మాదే ఎంఎల్‌సి ఫలితాలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు సిఎం రేవంత్
గాలి మాటలకు సమాధానాలు చెప్పను: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరిగి న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలువడిన అద్భుతమైన తీర్పు తమపై బాధ్యతను మరింత పెంచడంతో ‘సేవ్ తెలంగాణ.. సపోర్ట్ బీజేపీ’ అనే నినాదం తో ఇక నుంచి ముందుకు వెళతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడంలేదన్న విషయం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే తేలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించడం వల్లే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని తాము గెలుచుకోగలిగామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి ఘన విజయం సాధించిన నేపధ్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారిని ఆ పార్టీ నేతలు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ విజయోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని సంబురాలు నిర్వహించారు. దీంతో బిజెపి కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి ఎంపి లక్ష్మణ్, పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిందని, ఇందుకు సహకరించిన ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజతలు తెలిపారు. పట్టభద్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల చూపు బీజేపీ వైపు ఉందనేది ఈ ఎన్నికల ఫలితాలతో రుజువయ్యిందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపిదే అధికారం
రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఫలించలేదన్న కిషన్‌రెడ్డి తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తనపైనా, బిజెపిపైనా రేవంత్ రెడ్డి ఎదురు దాడి చేసి అనేక ఆరోపణలు చేశారని అన్నారు. వాటిని ప్రజలు పట్టించుకోకుండా బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేసుకుని చేసిన వ్యక్తిగత విమర్శలు, గాలి మాటలకు తాను సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలుచేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన జీవో 317 సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ సీట్లు గెలుచుకుందన్న కిషన్‌రెడ్డి అప్పట్లో తాము ఇంకా కొంచెం కష్టపడి ఉంటే మరిన్ని ఎంపీ సీట్లు దక్కించుకునేవాళ్లమని తెలిపారు. అలాగే ఖమ్మం- నల్గొండ -వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమిపై పార్టీ తరఫున సమీక్షించుకుంటామని అన్నారు. అక్కడ కూడా బలోపేతం అవుతామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలనెలా రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News