Monday, November 18, 2024

పార్టీ ఫిరాయింపుల చట్టానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తూట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. ఆదివారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ లో చేర్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నదని విమర్శించారు.

ఈ రెండు పార్టీలు మజ్లిస్‌తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మెజార్టీ తగ్గడానికి కాంగ్రెస్, మజ్లీస్ స్నేహమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపల్లిలో ప్రచారం చేయలేదని, ఇంటింటికి కరపత్రాలు పంచలేదని గుర్తు చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి లక్ష 2 వేల ఓట్లు వస్తే బీజేపీపై 62 వేల మెజార్టీ సాధించిందని గుర్తు చేశారు. జూబ్లిహిల్స్ సెగ్మెంట్ లోను బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందని చెబుతూ ఇందుకు కారణం మజ్లీస్ అని అన్నారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పేరు మీద మతోన్మాద శక్తులు పోటీ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారని అన్నారు. సికింద్రాబాద్‌లో పోటీ చేసిన అభ్యర్థి, పోటీ చేసిన గుర్తు కాంగ్రెసే అయినా నిజానికి అక్కడ పోటీలో ఉన్నది ఎంఐఎం పార్టీ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు. ఇటువంటి పరిస్థితిపై పార్టీ కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు. కేటీఆర్, రాహుల్ గాంధీలపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీనే గెలిచినట్లుగా కేటీఆర్ ఊహించుకున్నాడని కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. అధికారంలోకి వచ్చామని దాంతో ప్రమాణస్వీకారం ఎక్కడ చేయాలి? అతిథులను ఎవరిని పిలవాలి? మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? అని అనేక రకాలుగా ఊహించుకున్నారని చమత్కరించారు. కానీ ప్రజలు ఓడించడంతో ప్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని విమర్శించారు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిపోయినట్టుగా తన తాత, నాన్నమ్మ, నాన్న మాదిరిగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఊహించుకున్నారని ఎద్దేవా చేశారు. కానీ మోడీ గెలవడంతో ఆ అసహనం అంతా మొన్న పార్లమెంట్‌లో ప్రదర్శించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బయటపడుతుందని దేశ ప్రజలంతా చూడాలని కోరారు.

ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నరేంద్ర మోడీ ఘనత సాధించారని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్లో దేశ వ్యతిరేక శక్తులను పెంచి పోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి బాగా పెరిగిపోయినట్లు దేశ ప్రజలు గ్రహించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అందుకే మూడుసార్లు ఎన్డీయేకి పట్టం కట్టారన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా అణచివేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులు వచ్చాయని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. లోక్ సభ జరగకుండా అడ్డుపడటం, రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరించేందుకు సిద్ధమైందని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్‌ను అనేక అవమానాలకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే జమ్ముకాశ్మీర్‌లో ఉన్న జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసింది బీజేపీ మాత్రమేనని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ శిరసావహిస్తుందని చెప్పారు. మోడీ గెలవడంతో వ్యతిరేక శక్తులంతా ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. నరేంద్రమోడీకి మెజార్టీ తగ్గిపోయిందన్న కారణంతో జమ్ములో ఉగ్రవాదం పెరిగిపోయిందని అన్నారు. ఎప్పటి వరకు బీజేపీ, ఎన్డీయే అధికారంలో ఉంటుందో అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని అలా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఐఎస్‌ఐ కార్యకలాపాలు, అవినీతి, కుటుంబ పాలన, పైరవీ రాజ్ వ్యవస్థలు వస్తాయన్నారు. మోడీ వచ్చాకే పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు చిప్పపట్టుకునే స్థితికి తీసుకు వచ్చారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News