వర్షాలతో నష్టపోయిన రైతులను వదిలేసి.. దేశ్ కీ నేత అని కెసిఆర్ తిరుగుతున్నారు
పంటల బీమా పథకం అమలు చేయాలి
హైదరాబాద్: వార్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. పంటనష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. సహకారం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలి.రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద రూ.18,250 రాయితీ ఇస్తోంది.
యురియా ధరలు పెరుగుతున్నా రైతులకు రాయితీపై ఇస్తున్నాం. యూరియా బస్తాపై రైతు చెల్లించేది కేవలం రూ.266 మాత్రమే. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని కెసిఆర్ అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పరిమితమైంది. భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ విస్తరణపైనే సిఎం కెసిఆర్ దృష్టి పెట్టారు. రైతుల విషయం వదిలేసి దేశ్ కీ నేత అని కెసిఆర్ తిరుగుతున్నారు” అని విమర్శించారు.