Sunday, December 22, 2024

తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు?

- Advertisement -
- Advertisement -

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ మొహం పెట్టుకుని వచ్చారో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల హామీలను గాలి కొదిలేసిందంటూ ఆయన విమర్శించారు. హామీలు అమలు చేయలేదు కానీ, హామీలకు మించి పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్షణ్‌లతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో మూడోసారి మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ నాయకుడుగా గుర్తింపు పొందారని , దీంతో ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ – అగ్లె బార్ (వచ్చే సారి) 400 సీట్స్ అని ప్రతి ఇంటింటా కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని, బిఆర్‌ఎస్ రోజురోజుకూ కనుమరుగవుతుందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి బిజెపితోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి రెండంకెల సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో లేదు. గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు. గారడీ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు. ముఖ్యమంత్రికి హామీల అమలుపై దృష్టి లేదు. పార్టీ ఫిరాయింపుల మీదే దృష్టంతా.” అని కేంద్రమంత్రి – కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News