పార్లమెంటులో రాహుల్ గాంధీ పనితీరు ఇలా ఉందని, పైగా విదేశీ పర్యటనల్లో పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల విదేశీ పర్యటల్లో భాగంగా రాహుల్ గాంధీ బీజేపీ పట్ల చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీగా పార్లమెంటులో రాహుల్ గాంధీ హాజరు శాతానికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ 15వ లోక్ సభలో 43 శాతం హజరుతో 2 చర్చల్లో పాల్గొని ఎటువంటి ప్రశ్నలు అడగలేదని, అలాగే 16వ లోక్ సభలో 52 శాతం హాజరై 14 చర్చల్లో పాల్గొని కూడా సున్నా ప్రశ్నలు అడిగారని తెలిపారు.
ఇక 17వ లోక్ సభలో 51 శాతం హాజరుతో 99 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. దీనిపై ఆయన పార్లమెంటులో మోడీ ప్రభుత్వం తనని, తన పార్టీని మాట్లాడనివ్వడం లేదని విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. లోక్ సభ గత 3 సమావేశాలను గమనిస్తే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు హాజరయ్యారు, ఎన్నిసార్లు ప్రజాసమస్యల మీద స్పందించారో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఇక ఇతర ఎంపీల పనితీరు, హాజరు సగటుతో పోలిస్తే రాహుల్ గాంధీ రికార్డ్ చాలా పేలవంగా ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు.