హైదరాబాద్: మహబూబ్‌నగర్ -టు విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను నేడు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. -రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను మహబూబ్‌నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని దక్షిణమధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్‌ను కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంతో నేరుగా అనుసంధానించే మొదటి రైలు ఇది అని అధికారులు తెలిపారు. నేడు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలును జెండా ఊపి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో మహబూబ్‌నగర్ నుంచి కోస్తా ఆంధ్రాకు నేరుగా కనెక్టివిటీ లేదు.
ఈ సమస్యను తీర్చడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడిగించేందుకు ఆమోదించింది. పొడిగించిన ఈ రైలు ద్వారా నేరుగా మహబూబ్ నగర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయనపాడు (విజయవాడ), ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం మొదలైన ప్రధాన నగరాలకు ప్రయాణించేందుకు వీలుకలుగుతుంది. ఈ రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్ రైల్వే స్టేషన్‌లలో స్టాప్‌లను కల్పించారు. ఈ రైలుకు ఎల్‌హెచ్ బి కోచ్‌లను జతచేశారు. ఇవి ఆధునిక సౌకర్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.