మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణకు కొత్త అధ్యక్షుడి ఎంపిక ఘట్టం చివరి అంకానికి వచ్చినట్లు తెలుస్తోం ది. పార్టీలో ఇప్పటికే బిజెపి రాష్ట్ర అ ధ్యక్ష నియామకం విషయంలో వర్గాలుగా విడిపోయి ఎవరికి తోచింది వా రు మాట్లాడడం, అనవసర ప్రచారం జరుగుతుండడం పార్టీ అధిష్ఠానికి తలనొప్పిగా మారింది. రానున్న నాలుగైదు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపికను ప్రకటించేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని బిజెపి అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై కసరత్తు పూర్తి చేయడంతో కిషన్‌రెడ్డితో ఈ విషయాలు చర్చించి త్వ రగా కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇందుకే ఆయన ఢిల్లీకి ఆకస్మికంగా వెళ్లారని చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీలో కీలకంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఒకటి రెండు సార్లు రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారడంతో ఈ అంశాలను సైతం కమలం పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంపే అవుతారని, అదే కేంద్ర కమిటీ నిర్ణయిస్తే బాగుంటందని నేరుగా రాజాసింగ్ వ్యాఖ్యానించడం పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తయినందున ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఆ ఎంపికైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉండడం అంటే పార్టీ నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
పార్టీలోని కొందరు బయటకు వెళ్లకపోతే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి ఎలా వస్తుందని ఆయనే స్వయంగా నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇదిలావుంటే తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా తాను కేంద్ర మంత్రిగా ఉన్నానని, రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇస్తారని తాను అనుకోవడం లేదని, ఒక వేళ ఇస్తే కాదనని స్పష్టం చేశారు. తనకు అధ్యక్ష బాధ్యతలు ఒకసారి అప్పగిస్తే ఎలా పని చేశానో పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసునని, ఇప్పుడు ఎవరికి ఇస్తారు అనేది పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని పేర్కొన్నారు. మరో వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయకుండా ఇలా పార్టీ అధిష్ఠానం నాన్చుడి ధోరణి సరికాదని పార్టీ క్యాడర్‌లోనూ నిరుత్సాహం వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించినా ఇంకా మరికొన్ని జిల్లాలకు నియమించాల్సి ఉంది. అధ్యక్ష పదవికి పలువురు పోటీపడుతుండడంతో ఎవరికి ఇవ్వాలనేది తేలాల్సి ఉంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఎంపిక దాదాపు పూర్తయ్యిందని చెబుతున్నారు. ఇటీవల మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలిశారు. ఈ పరిణామంతో ఆయన పేరు రాష్ట్ర అధ్యక్ష పదవికి దాదాపు ఖరారైనట్లేనని చర్చించుకున్నారు.