తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని చెప్పారు. ఆరు గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారన్నారు. ఆరు గ్యారెంటీలు అయ్యేది కాదు.. పోయేది కాదని ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పారా?.. ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి.. ఏరకంగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఛార్జిషీట్ ప్రకటించింది. ఛార్జిషీట్ల ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఛార్జిషీట్ నిజమైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందులు లేవు ? అని ఆయన ఆడిగారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటే.. రెండు కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి తెలిపారు.