Saturday, November 23, 2024

జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును

- Advertisement -
- Advertisement -

KK Ranganatha Charya contemporaries of rare intellectual property

 

కరోనాతో కాలధర్మం అసహజ మరణం కిందే లెక్క. కాలంతో కలిసి నడుస్తూ వచ్చిన ఆధునికుడు కె.కె.రంగనాథాచార్యులు( 14.6.1940-16.5.2021)ను కరోనా కబళించటం బర్బరం, దుర్బరం. రా.రా. ఎప్పుడో అన్నట్టు పాశ్చాత్యుల మేధతో పోల్చి చూస్తే మన మేధాస్థాయి తక్కువ. కాని కె.కె. రంగనాథాచార్య (కె.కె.ఆర్) సమకాలీనులలో అరుదైన మేధాసంపద ఉన్నవారు. ఇటు సాహిత్యరంగంలో, అటు భాషాశాస్త్ర రంగం లో సమస్థాయిలో నైపుణ్యం సంపాదించిన అరుదైన మేధావి. ఆయినా కె.కె.ఆర్ ఎప్పుడూ మేధావిగా కనిపించే ప్రయత్నం చేయలేదు. వారికి ఆ స్పృహ లేదు. కీర్తికి కావాలనే దూరంగా ఉండేవారు. వారు తలుచుకుంటే వారి కృషికి పెద్ద పెద్ద అవార్డులే వచ్చేవి. వాటికి వారెంతో దూరం.

వారితో నా తొలిపరిచయం 1980లో. వారప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రిన్సిపాల్ గా ఉన్నారు. నా మొదటి కవితా, సంపుటి ‘మిణుగురు’ ఆవిష్కరణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరిగింది. వేదిక మీద సినారె, దేవులపల్లి రామానుజరావు, ఇరివెంటి, తిరుమల శ్రీనివాసాచార్య, చెన్నకేశవరెడ్డి, కన్నసామి ఉన్నారు.

‘జనం తక్కువగా ఉన్నారు సార్’ అని కె కె ఆర్‌తో అనగానే, తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను రప్పించారు. సారస్వత వేదిక కార్యదర్శిగా స్వాగత వచనాలు దగ్గరనుండి వందన సమర్పణ దాకా కెకెఆర్ చూసుకున్నారు. సారస్వత పరిషత్తు నుండి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా వెళ్లారు. ఓరియంటేషన్/ రిఫ్రెషర్ కోర్సులకు తప్పనిసరిగా హాజరుకావాలని యు.జి.సి. నిర్దేశించటంతో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న నేనూ వెళ్ళాను. అప్పుడు కె.కె.ఆర్ సంచాలకులు. ఆ మూడు వారాల్లో మూడు సార్లు కవిత్వం మీద వారే మాట్లాడారు. ‘మిత్రమా !’ అని సంబోధించేవారు. కొంత చనువు ఏర్పడింది. ఈస్తటిక్స్ మీద డా. వీరభదయ్య గారు మాట్లాడారు. ఇంత అందంగా ఉన్న కె.కె.ఆర్ ఈ స్తటిక్స్ మీద మాట్లాడితే బాగుండేది’ అనిపించింది.
ఒక విషాద భరిత సందర్భంలో సమయస్ఫూర్తితో వారు వేసిన ఛలోక్తి ఒకటి నాకు బాగా గుర్తు. చేరా గారు మరణించారు. తార్నాకా వెనకవైపు అంత్యక్రియలకు నడుస్తూ వెళ్తున్నాం. ఒక చిన్న గల్లీలో వాననీరు నిలిచి వుంది. ఆగిపోయాం. అప్పుడు యువమిత్రులు కొందరు దగ్గరలో ఉన్న రాళ్ళను అడ్డదిడ్డంగా పరిచి మొత్తం మీద, దాటి వెళ్లేదారి వేశారు. దాన్ని చూసి ‘సంక్లిష్టవాక్యం లాగా వుంది’ అన్నారు కె.కె.ఆర్. అందరం తెలుగు వాక్యం మీద చేరా చేసిన కృషిని గుర్తు తెచ్చుకున్నాం.

కె.పి. అశోక్‌కుమార్ గృహ ప్రదేశం. బస్సులో వెళ్తున్నాం. పక్కపక్క సీట్లలో కూర్చున్నాం. టాపిక్ పాత సినిమాల మీదకు మళ్లింది. దిలీప్‌కుమార్ తొలిదశలో నటించిన ‘జ్వర్‌భాటా’, ‘మిలన్’ ‘మేలా’ వంటి సినిమాలను తాను చూసినట్టు చెప్పారు. పాత తెలుగు సినిమాల ప్రసక్తి వచ్చింది. వారు తమకు నచ్చిన పాటలను ప్రస్తావించారు. వెన్నెల మీద వచ్చిన పాటలు తమకు ఇష్టమన్నారు. నేను ‘మిస్సమ్మ’ సినిమాలోని ‘రావోయి చందమామ’ పాటను గుర్తు చేశాను. “ పాటలో చిన్న డ్రామా వుంది. అందుకే మీకు నచ్చినట్టుంది. కాని ఈ పాట కంటే ఈ సినిమాలోనిదే ‘ఏమిటో ఈ మాయా, ఓ చల్లని రాజా!’ పాట బాగుంటుంది. ఇందులో ‘వినుటయో కాని వెన్నెల మహిమలు అనుభవించేనెనెరుగనయా” అన్న చరణం నాయిక మగ్ధత్వాన్ని తెలియజేస్తుంది’ అన్నారు. వారి విశ్లేషణ సినీ కవి గౌరవాన్ని పెంచేదిగా ఉందనిపించింది. ఆ తర్వాత ప్రొ.భద్రరాజు కృష్ణమూర్తి గారిని గూర్చి నేను రాసిన రెండు వ్యాసాలను డా.అప్పం పాండయ్య ద్వారా తెప్పించుకొని ఒకదాన్ని ఎంపిక చేసుకొని ‘స్మృతి సంచిక’లో వేసుకున్నారు. వారి పుస్తకం ‘తొలినాటి తెలుగు కథానికలు’ పుస్తకం మీద నేను రాసిన సమీక్షా వ్యాసం (2009) చదివి బాగుందని అన్నారని డా.పోరంకి దక్షిణామూర్తి చెప్పగా విన్నాను.

ఈ సందర్భం తర్వాత కె.కె.ఆర్‌ను గూర్చి ‘సార్ కేం తమకు నచ్చిన పద్ధతిలో ఉంటున్నారు’. అని డా.అప్పం పాండయోయయ, కె.పి.అశోక్‌కుమార్ చెప్పే తెలిసేది. మరణవార్త మాత్రం వాట్సాప్ యాప్ ద్వారా తెలిసింది. 80 ఏళ్లు దాటినా వారి ముఖంలో వృద్ధాప్యంఛాయలే కనిపించలేదు. అందుకే మరణవార్తను నమ్మటం కష్టసాధ్యమైంది.
స్కూల్ టీచర్‌గా మొదలైన కె.కె.ఆర్ ఉద్యోగ యాత్ర ఓరియంటల్ కళాశాల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‌గా సాగి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా కొనసాగి డీన్‌గా ముగిసింది. మార్కిజం భావజాలం పునాదిగా సాహిత్య భాషా శాస్త్రాలను, ఇతర సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేశారు. మూడు ఎంఎలు (తెలుగు, లిగ్విస్టిక్స్, సంస్కృతం) చేశారు. అందుకేనేమో భిన్నశాస్త్రాల సమన్వయంతో – interdisciplinary కోణంలో అధ్యయనం ఇష్టపడ్డారు. ఆ రకంగా క్లిష్టమైన సూత్రాలను సరళీకరించుకొని వాటిని విద్యార్థులకు బోధించటం వారి పద్ధతి. విశ్వవిద్యాలయ విద్యార్థులు సాధారణంగా బోధనలో కొత్తదనాన్ని, ఆధునికతను ఇష్టపడతారు.

తాము ఉద్యోగార్థులుగా విజయం సాధించటానికి, ఉద్యోగులై వృత్తి జీవితాన్ని విజయవంతంగా కొనసాగించటానికి ఈ ఆధునికత వారికి ఉపయోగపడుతుంది. కె.కె.ఆర్ రిటైరయ్యి ఇన్నేండ్లయినా, వారి విద్యార్థులు మంచి పొజిషన్లలో పనిచేస్తున్నా ఇటీవలి జూం సమావేశాలలో కెకెఆర్‌ను స్మరించుకొని మళ్లీ ప్రత్యక్ష శిష్యులైపోయారంటే, ఆ గురువు గారు తమ విష్యులకు గరపిని విద్య జీవితమంత గొప్పదైవుండాలి.

ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృక్పథంతో పరిశీలించటమే ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్. ఇట్లాంటి పరిశీలన విషయమై కెకెఆర్ ఆద్యుడు కాకపోవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి అప్పటికే ప్రాచీన కవిత్వాన్ని సాంఘిక దృష్టితో పరిశీలించి దానికో చరిత్ర రూపాన్ని ఇచ్చివుండవచ్చు. అయితే ఈ భావనను బలంగా చెప్పినవారు మాత్రం కెకెఆరే. యువ రచయితలు, విద్యార్థి వర్గాల్లో ఇది వెంటనే ప్రచారంలోకి వచ్చింది. ఇందుకు సమాంతర, సారస్వత వేదిక వారికి బాగా పనికి వచ్చాయి. వారి ‘తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక’లోని ప్రధాన అంశం ఇదే.

తిక్కన విరాటపర్వంలో ప్రారంభమైన భాగం మొదట్లో ‘కిమస్థిమూలాం కిముకౌస్తుభంవా’ అన్న శ్లోకంలోను, ‘శ్రీయన గౌరినా బరగు’ పద్యంలోను తిక్కన ప్రతిపాదించిన హరిహరాద్వైతం అప్పట్లో మత యుద్ధాలకు పూనుకున్న శైవ వైష్ణవాల మధ్య సయోధ్యం కోసం ఉద్దేశించిన సరికొత్త దైవరూపంగా కొందరు పరిశోధకులు భావించారు. కాని అప్పటికే నెల్లూరులోనే హరిహరనాథాలయం ఒకటుండేదని నమ్మేవాళ్ళే ఎక్కువ. తిక్కన తెచ్చిన మతసంబంధమైన తిరుగుబాటు ఏమీ లేదని, ఆయన నన్నయ్య వైదిక మార్గాన్ని అవలంబించిన వాడేనని కెకెఆర్ నమ్ముతున్నారు. గణపతిదేవుని కోరిక మేరకు బౌద్ధులను మతవాదంలో తిక్కన ఓడించటాన్ని, గెలిచిన ఉత్సాహంతో బౌద్ధుల దేవాలయాలను కూల్చివేసి హిందూ ఆలయాలను నిర్మించటాన్ని ఈ కోణంలో చూడవలసి వుంది.

‘ఆధునికత’ కాలవాచి కాదంటారు కెకెఆర్. ‘ గత సమాజంలో పోల్చినప్పుడు సమకాలీన సమాజంలో సామాజిక రాజకీయాది రంగాలలో మొదటి ఉపరిత అంశంగా ఉద్యమాల ద్వారా ప్రారంభమైన క్రమంగా ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల వల్ల స్థిరపడింది. ఈ ఉద్యమాలలో సంఘ సంస్కరణోద్యమాలు ముఖ్యమైనవి’ అంటారు. అందుకే వీరేశలింగం పంతులు గారికి పెద్దపీట వేస్తారు.

‘సంస్కృతి’ మీద 1985లో ప్రజాసాహితిలో వచ్చిన వ్యాసం చదివితే కెకెఆర్ ఎంత బహుముఖంగా ఆలోచించగలరో అర్థమవుతుంది. ‘సంస్కృతిని గురించి ఏకరూపత కలిగిన నిర్వచనం ఇంతవరకు కనిపించదు’ అంటూ వ్యాసాన్ని ప్రారంభిస్తారు. భావ భౌతికవాద తాతిక ధోరణులను బట్టి సంస్కృతీ స్వరూపాన్ని అనేక రకాలుగా నిర్వచించటం కనిపిస్తుందంటారు. నాగరికతలో భాగంగా మానవ నిర్మాణాలు, సృజనాత్మక కళల సమాహారంగా సంస్కృతిని కొందరు నిర్వచిస్తారంటూ పేర్కొన్నారు. సంస్కృత భాషను, భారత రామాయణాలను సంస్కృతీ కేంద్రాలుగా భావించిన వారున్నరంటారు. సనాతనం, నిత్యం, సత్యం అన్న ఆధ్యాత్మికతే కొన్ని శతాబ్దాలు సంస్కృతిగా చలామణిలో వుందంటారు. హిట్లర్ వంటివారు ‘ఆర్య’ సంస్కృతి ఆధికతాభవం తలకెక్కి ఇతరులంతా ‘బార్బేరియన్స్’ అన్నాడట. మధ్యయుగాలలో కళలు, మతాలు, దేవాలయాల చుట్టూ తిరిగేవి. అందుకే “నిజమైన జాతీయ సంస్కృతి అంటే పూర్తిగా పాత సంస్కృతిగాని, దిగుమతి సంస్కృతి అంతకంటే కాదు” అంటూ “ప్రజాబహుళ్య సంస్కృతే నిజమైన జాతీయ సంస్కృతి” అంటున్నారు కెకెఆర్.

‘తొలినాటి తెలుగు కథానికలు’ (2008) అన్న కెకెఆర్ గ్రంథం 18981930 మధ్యకాలంలో వివిధ ప్రాంతాల తెలుగు కథకులు రాసిన 570 కథానికల విశ్లేషణ. ‘పూర్వగాథాలను నేటి మాటలలో చెప్పడం నుంచి నేటి వాస్తవాన్ని నేటి మాటలలో, నేటి పద్ధతిలో చెప్పడంలోకి మారడమే ఆధునిక కథానిక అంటున్నారు. తొలికథానికను ఎవరు రాశారన్న ప్రశ్నకు సాహిత్య చరిత్ర దృష్టా ప్రాధాన్యత ఉంటుందంటూ సంగిశెట్టి శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చిన బండారు అచ్చమాంబ కథల ప్రాథమ్యాన్ని కెకెఆర్ అంగీకరించారు. ‘స్త్రీ జీవిత సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రచయితలు రాస్తున్నకాలంలో ఒక స్త్రీ కంఠస్వరం ఆమె రచనల్లో ఏ రకంగా వినిపించిందనేది ఆసక్తికరమైన అంశంగా తెరపైకి వస్తుంది అన్నారు. ‘గురజాడ మొదటి కథకుడు కాకపోవడం వల్ల ఆయనకుగాని, ఆయన కథలకు గాని వచ్చే తక్కువదనం ఏమీ లేదు’ అని అంటున్నారు. నిజానికి గురజాడ వీరాభిమాని అయివుండే ఈ మాట అంటున్నారంటే కెకెఆర్ పరిశోధనలో పాటించిన ప్రమాణాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News