సమిష్టి కృషికి ఇచ్చిన అవార్డును వ్యక్తిగతంగా తిరస్కరించలేనని వెల్లడి
సిపిఎం నేతలతో చర్చించాక నిర్ణయం
కమ్యూనిస్టులను క్రూరంగా అణచివేసిన వ్యక్తి పేరిట ఏర్పాటుచేసిన అవార్డు అది: సీతారాం ఏచూరి
తిరువనంతపురం/ న్యూఢిల్లీ: సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు, కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డును స్వీకరించరాదని నిర్ణయించుకున్నారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మెగసెసే తన హయాంలో కమ్యూనిస్టుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందున ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డును స్వీకరించరాదని ఆమె నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత హోదాలో తాను ఈ అవార్డును స్వీకరించాలని అనుకోవడం లేదని శైలజ కేరళలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పగా, ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులను దారుణంగా అణచివేసిన చరిత్ర కలిగిన మెగసెసే పేరిట ఈ అవార్డు ఇస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలయిన శైలజ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ అవార్డు ఇచ్చారని, అయితే అది అందరూ కలిసికట్టుగా చేసిన కృషి అయినందున తాను వ్యక్తిగతంగా ఈ అవార్డును అందుకోవడం సబబు కాదని శైలజ చెప్పారు.
కాగా ‘ఈ అవార్డు ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులను దారుణంగా అణచివేసిన చరిత్ర కలిగి ఉన్న రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు ఉంది. ఈ అంశాలన్నిటి దృష్టా ఆమె ఈ అవార్డును అందుకొంటున్న తొలి రాజకీయవేత్తను తానేనంటూ వినమ్రంగా ఈ అవార్డును తిరస్కరించారు’ అని న్యూ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడిన ఏచూరి చెప్పారు. పార్టీని సంప్రదించిన తర్వాత శైలజ ఈ అవార్డును స్వీకరించడానికి నిరాకరించారని ఆదివారం కొన్ని మీడియా సంస్థల్లో వారలు వచ్చాయి.‘ అవార్డు ప్రకటించిన ఎన్‌జిఓ కమ్యూనిస్టు సిద్ధాంతానికి అనుకూలమైనది కాదు. అంతేకాదు ఉమ్మడి కృషిలో భాగమైన సేవలకు గాను నన్ను అవార్డుకు ఎంపిక చేసినందున వ్యక్తిగతంగా నేను ఈ అవార్డును స్వీకరించడం సరికాదు.
అందువల్ల ఈ అవార్డును తీసుకోరాదని నేను నిర్ణయించుకున్నారు.. నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసి వ్యక్తిగత హోదాలో అవార్డు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని పేర్కొంటూ వినమ్రంగా అవార్డును తిరస్కరించాను’ అని శైలజ తెలిపారు. కేరళలో ప్రజారోగ్య సమస్యలను నిర్వహించిన తీరుకుగాను ఈ అవార్డు ఇచ్చారని ఏచూరి చెప్పారు. ఇది ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, కేరళలో ఆరోగ్య శాఖ ఉమ్మడి కృషి. అందువల్ల ఇది వ్యక్తిగత కృషి కాదని ఆయన చెప్పారు. కాగా ఇంతవరకు ఏ క్రియాశీల రాజకీయవేత్తకు ఈ అవార్డు ఇవ్వలేదని, కేంద్ర కమిటీ పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అని ఆయన చెప్పారు.