Sunday, December 22, 2024

హ్యాట్రిక్‌పై కోల్‌కతా కన్ను

- Advertisement -
- Advertisement -

నేడు విశాఖలో ఢిల్లీతో పోరు
విశాఖపట్నం: వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. డిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంను తన హోం గ్రౌండ్‌గా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. తొలి ఫేజ్‌లో ఢిల్లీ ఆడే రెండు మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే విశాఖలో చెన్నైతో ఢిల్లీ ఓ మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై వంటి బలమైన జట్టును ఓడించడంతో ఢిల్లీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్‌కతా కూడా ఇప్పటికే రెండు విజయాలు సాధించి జోరుమీదుంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్‌లు కిందటి మ్యాచ్‌లో జట్టును శుభారంభం అందించారు. నరైన్ ఇటు బ్యాట్‌తో అటు బంతితో చెలరేగి పోతున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సాల్ట్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. వెంకటేష్ అయ్యర్ కూడా దూకుడు మీదున్నాడు. కిందటి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు.

శ్రేయస్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్‌దీప్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. రసెల్ సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. కిందటి మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఛాన్స్ లభిస్తే మరోసారి చెలరేగేందుకు రసెల్ సిద్ధంగా ఉన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి, నరైన్, రసెల్, మిఛెల్ స్టార్క్ తదితరులతో కోల్‌కతా బౌలింగ్ కూడా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేయడం కోల్‌కతాకు కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News