Monday, December 23, 2024

 ప్లేఆఫ్ లక్ష్యంగా కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. ఇక ముంబై ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది.

మరో 8 మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. దీంతో ముంబై నాకౌట్ ఆశలకు తెరపడింది. కోల్‌కతా మాత్రం 11 మ్యాచుల్లో 8 గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే నైట్‌రైడర్స్ అధికారికంగా ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా సమతూకంగా ఉంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్‌లు ఫామ్‌లో ఉన్నారు. నరైన్ అయితే ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో ఈ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. కోల్‌కతా విజయాల్లో నరైన్‌దే కీలక పాత్ర అని చెప్పక తప్పదు.

తాజాగా లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. అంతేగాక బంతితోనూ రాణించి ఒక వికెట్‌ను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా నరైన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సాల్ట్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తనవంతు సహకారం అందిస్తున్నాడు. నరైన్, ఫిలిప్ మరోసారి మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ముంబై బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక రఘువంశీ, రసెల్, రింకు సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. శ్రేయస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. రింకు సింగ్, రసెల్, వెంకటేష్‌లు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కోల్‌కతాలో కొదవలేదు. ఇక బౌలింగ్‌లో కూడా నైట్‌రైడర్స్‌కు ఎదురు లేదనే చెప్పాలి. స్టార్క్, నరైన్, హర్షిత్ రాణా, చక్రవర్తి, రసెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక దశలో వికెట్లను తీస్తూ ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నారు. ముంబై మ్యాచ్‌లోనూ అదే సంప్రదయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పరువు కోసం..

మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. కోల్‌కతాతో ఇంతకుముందు జరిగిన మ్యాచుల్లో ముంబైకి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. పటిష్టమైన సన్‌రైజర్స్‌తో జరిగిన పోరులో విజయం సాధించడం ముంబై ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అయితే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధిర్, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతుండడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగైన ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది. లేకుంటే ముంబైకి మరో ఓటమి తప్పక పోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News