నేడు కోల్‌కతాతో రాజస్థాన్ ఢీ
కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం కీలక పోరు జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ప్రస్తుతం ఇరు జట్లు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకాలని కోల్‌కతా భావిస్తుంటే.. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలుస్తే పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇరు జట్లు సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నాయి. ఇటు కోల్‌కతా, అటు రాజస్థాన్ జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. మరోవైపు రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగా ఉంది. కెప్టెన్ సంజు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్ తదితరులతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. శాంసన్, బట్లర్, పరాగ్, యశస్వి తదితరులు చెలరేగితే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయం. అంతేగాక బౌల్ట్, అవేశ్ ఖాన్, కేశవ్ మహారాజ్, చాహల్, అశ్విన్‌లతో రాజస్థాన్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో రాజస్థాన్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.
ఫేవరెట్‌గా నైట్‌రైడర్స్..
మరోవైపు ఆతిథ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాకు ఓటమి పాలైంది. ఆతరువాత జరిగిన లక్నోతో మ్యాచ్‌లో విజయం సాధించి ఓటమికి ప్రతికారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాలనే తపనతో బరిలోకి దిగుతోంది.
సాల్ట్, నరైన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసెల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బౌలింగ్‌లోనూ జట్టు పటిష్టంగా ఉంది. స్టార్క్, వరుణ్, రసెల్, నరైన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీనికి తోడు సొంత మైదానంలో పోరు కావడం కూడా కోల్‌కతాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.