ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. అన్ని విభాగాల్లో రాణిస్తూ.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన ఏడు మ్యాచుల్లో 5 మ్యాచుల్లో ఈ జట్టు విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఢిల్లీ ఆటగాడు కెఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నాడు. తనకు కూతురు పుట్టిన సందర్భంగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. ఆరు మ్యాచుల్లో 266 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో 12 వికెట్లు తీసి.. పర్పల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే మంగళవారం ఢిల్లీ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్, కుల్దీప్‌లు అరుదైన రికార్డులు సాధించే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేస్తే.. ఐపిఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని దాటేస్తాడు. ఇక కుల్దీప్ ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే.. ఐపిఎల్‌లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం వీరిద్దరి ఉన్న ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు కచ్చితంగా సాధించగలరని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.