వైద్యం కోసం రూ.31 లక్షల ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువ క్రికెటర్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్.రాహుల్ ఆర్థిక సహాయం అందజేశాడు. సబ్ జూనియర్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న 11 ఏళ్ల వరాద్ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు. అతనికి అత్యవసరంగా బ్రోన్ మారొ ట్రాన్స్‌ప్లాంట్ (బిఎంటి) చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కోసం దాదాపు 35 లక్షల రూపాయల వరకు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో వరాద్ తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడేందుకు దాతల సాయం కోరారు. ఈ క్రమంలో ఏజెంట్‌ల ద్వారా రాహుల్‌ను సంప్రదించారు. ఇక వరాద్ పరిస్థితికి చలించిన రాహుల్ భారీ ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన రాహుల్‌కు వరాద్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాహుల్ పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.